Advertisement
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ టు రిమాండ్ వకు హైడ్రామా కొనసాగింది. మంగళవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ కు సంబంధించి బండిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. ఈ విషయాన్ని మధ్యాహ్నానికి కానీ, రివీల్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఏం చెప్పకుండానే ఓ 40 మంది పోలీసులు తమ ఇంటిలోకి వచ్చారని బండి కుటుంబసభ్యులు మండిపడ్డారు.
Advertisement
సంజయ్ ను అరెస్ట్ చేశాక బొమ్మలరామారం పీఎస్ కు తరలించారు పోలీసులు. అయితే.. బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకునేందుకు ప్రయత్నించగా.. ఎక్కడికక్కడే నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈటల రాజేందర్ తన ఇంటి నుంచి హైదరాబాద్ వస్తుండగా అడ్డుకున్నారు. బొమ్మలరామారం పీఎస్ దగ్గర రఘునందన్ ను అరెస్ట్ చేశారు. అలాగే, బండిని వరంగల్ తరలించే క్రమంలో కీసర దగ్గర రాజాసింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Advertisement
బండి సంజయ్ ను హన్మకొండలో మెజిస్ట్రేట్ ముందుకు హాజరు పరిచారు పోలీసులు. న్యాయమూర్తి 14 రోజులపాటు ఆయనకు రిమాండ్ విధించారు. దీంతో 19 వరకు జైలులోనే ఉండనున్నారు సంజయ్. తీర్పు తర్వాత ఆయన్ను కరీంనగర్ జైలుకు తరలించారు. అంతకుముందు బండిని కోర్టు ఆవరణలోకి తీసుకొచ్చిన క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. చెప్పులు, కోడిగుడ్లతో దాడి చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడతారా? అంటూ మండిపడ్డారు.
మరోవైపు వరంగల్ సీపీ మీడియా సమావేశం నిర్వహించారు. పేపర్ లీకేజ్ లో ప్రధాన సూత్రధారి బండి సంజయే అని తెలిపారు. నిందితుడు ప్రశాంత్ కు ఆయన రెగ్యులర్ గా ఫోన్ కాల్స్, మెసేజెస్ నడిచాయని తెలిపారు. డిలీట్ చేసి మెసేజ్ లు ఇతర వాటిని ఓపెన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పేపర్ బయటకొచ్చిన ముందు రోజు కూడా బండితో ప్రశాంత్ మాట్లాడాడని చెప్పారు సీపీ.