Advertisement
అధికార పార్టీని ప్రతిపక్షాలు విమర్శించడం కామన్. అలాగే ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కూడా కామనే. కానీ, ఒక్కోసారి ఈ విమర్శలే ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తాయి. జనం బయట తిరిగేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఏపీలోకి మాచర్లలో అదే పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య జరుగుతున్న యుద్ధంలో సామాన్యులు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
Advertisement
ఈమధ్యే మాచర్ల నియోజకవర్గం సినిమా వచ్చింది. అందులో విలన్ ని అత్యంత క్రూరుడుగా చిత్రీకరించారు. ప్రజలను రాచిరంపానపెట్టే క్యారెక్టర్ అది. మాచర్లలో ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా సినిమాలో విలన్ మాదిరిగా చేస్తున్నారని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. 2009 నుంచి మూడుసార్లు(బైపోల్ సహా) గెలుపొందారు. మొదటిసారి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఈయన తర్వాత వైసీపీలో చేరి విజయం సాధించారు.
Advertisement
ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే మాచర్లలో ఏర్పాట్లు చేసింది. కానీ, టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగి.. ఘర్షణకు దారితీసింది. రాళ్లు, కర్రలు, సీసాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. వాహనాలు, ఇళ్లు, దుకాణాలు తగులబడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా మాచర్లలో విధ్వంసం జరిగింది. పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. అయినా, దాడులు కొనసాగాయి. టీడీపీ కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అదనపు బలగాలను మోహరించారు. ఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు పోలీసులు. అయితే.. మాచర్లలో జరిగిన గొడవలకు ఫ్యాక్షన్ మూలాలే కారణమని చెప్పారు ఎస్పీ. వెల్దుర్తి మర్డర్ కేసులో ఉన్న ఫ్యాక్షన్ నాయకులు రాజకీయ పార్టీల ఆశ్రయం పొంది గొడవలకు పాల్పడ్డారని తెలిపారు. వెల్దుర్తి చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న ముద్దాయిలే మాచర్లకు వచ్చారని చెప్పారు.
మరోవైపు టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు బురుద జల్లుకుంటున్నారు. చంద్రబాబు ప్లాన్ బీ లో భాగమే ఈ దాడులని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై నిజ నిర్థారణ కమిటీ వేసి.. రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. అయితే.. వైసీపీ ఉద్దేశ పూర్వకంగానే దాడికి పాల్పడిందని టీడీపీ నేత బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. ముందస్తుగా సమాచారం ఇచ్చినా దాడులు అడ్డుకోవటంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు.