Advertisement
నార్త్ లో బుల్డోజర్ పనిష్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యూపీలో మొదలైన ఈ ట్రెండ్.. క్రమంగా చుట్టుపక్కల రాష్ట్రాలకు పాకింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా, నేరాలు చేసినా వెంటనే నిందితుల ఇళ్ల దగ్గరకు బుల్డోజర్లు వాలిపోతాయి. కాస్త కూడా దయ లేకుండా కూల్చివేస్తాయి. ప్రభుత్ పెద్దల ఆదేశాలతో అధికారులే దగ్గరుండి మరీ ఈ తంతు కొనసాగిస్తారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ ఘటన జరిగింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Advertisement
రేవా జిల్లాలో పంకజ్ త్రిపాఠీ అనే యువకుడు ఓ యువతిని నిర్దాక్షిణ్యంగా కొడుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. అందులో యువతిని తీవ్రంగా గాయపరిచాడు పంకజ్. తనని పెళ్లి చేసుకోవాలని కోరగా.. ఆమె నిరాకరించడంతో ఇలా ప్రవర్తించాడు. బాధితురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ పోయి ముఖంపై కాళ్లతో తన్నాడు. ఆమె స్పృహ కోల్పోయినా కూడా కొడుతూనే ఉన్నాడు.
Advertisement
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ స్వయంగా చొరవ తీసుకున్నారు. దీంతో నిందితుడి ఇంటిని కూల్చివేయాలని, డ్రైవర్ అయిన అతని లైసెన్స్ ను రద్దు చేయాలని ఆదేశించారు. ఈక్రమంలోనే బుల్డోజర్ తో పంకజ్ ఇంటిని కూల్చివేశారు అధికారులు. బాధితురాలిపై కిరాతకంగా దాడి చేసి యూపీకి పారిపోయిన అతడ్ని అరెస్టు చేశారు.
ఇక పంకజ్ దాడిలో గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇలాంటి నిందితుల పట్ల తామెంత మాత్రం ఉదాసీనంగా వ్యవహరించబోమని, వారి ఇళ్లను ఇలాగే బుల్డోజర్ తో కూల్చివేయడం జరుగుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు నేరాలకు పాల్పడిన వారి ఇళ్లను కూల్చివేశారు.