Advertisement
నేటి రోజుల్లో ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ఆర్థిక అవసరాలలో ఉన్న వారే ఇలాంటి మోసాలకు అధికంగా గురవుతున్నారు. సామాన్య ప్రజలే టార్గెట్ గా సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయి తన తండ్రి ఖాతా నుంచి డబ్బు వాడుకొని.. ఆ డబ్బు తిరిగి ఇచ్చేందుకు కిడ్నీ అమ్మాలని నిర్ణయించుకుంది. కానీ చివరికి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి చెందిన ఓ ఆసామి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమార్తె హైదరాబాదులో ఇంటర్ విద్యని అభ్యసిస్తుంది. అయితే ఆమె తన వ్యక్తిగత అవసరాల కోసం తండ్రి ఏటీఎం కార్డు ద్వారా రెండు లక్షల వరకు వాడుకుంది.
Advertisement
Read also: వైరల్ గా బాలకృష్ణ పెళ్లి శుభలేఖ
Advertisement
ఈ విషయం తండ్రికి తెలిస్తే మందలిస్తాడు అన్న భయంతో ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. ఆ డబ్బులు సంపాదించే మార్గం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 26న యూట్యూబ్ లో వెతికింది. అందులో కిడ్నీ దానం చేస్తే ఏడు కోట్లు చెల్లిస్తామనే ప్రకటన ఆమెను ఆకర్షించింది. దీంతో వాట్సాప్ ద్వారా వారిని సంప్రదించి మాట్లాడింది. దీంతో ఆ విద్యార్థి తన కిడ్నీ అమ్మడానికి సిద్ధపడింది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలంటే పన్నుల రూపేనా ముందుగా నగదు చెల్లించాల్సి వస్తుందని అమ్మాయికి చెప్పారు. ఈ క్రమంలో సైబర్ దొంగలు ఆ విద్యార్థి తండ్రి పేరు మీద ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రూ. 3.50 కోట్లు జమ చేసినట్లు ఆమెను నమ్మించారు. అయితే ఆ సొమ్ము విడుదల కావాలంటే మొదటి పన్నుల రూపేనా డబ్బులు కట్టాలని ఆమెను నమ్మించి విడతలవారీగా 16 లక్షల వరకు వసూలు చేశారు.
చివరకు కిడ్నీ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన ఆ విద్యార్థినికి అసలు విషయం తెలిసి గుండె ఆగినంత పని అయింది. తాను మోసపోయానని గ్రహించి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. ఇది సైబర్ మోసం అని ఢిల్లీ పోలీసులు ఆమెకి తెలిపారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి.. ఈ విషయం తన తండ్రిని తెలిస్తే తిడతాడని భయంతో స్నేహితుల వద్దకు వెళ్లి తలదాచుకుంది. అయితే తన కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెను గుర్తించి పోలీసులు తండ్రికి అప్పగించారు. ఆ తర్వాత డబ్బులు విషయమై కుమార్తెను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆ తండ్రి కూతుర్లు కలిసి ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read also: ట్రెండింగ్‌లో పవన్ “వారాహి” వాహనం! అసలు ఆ పేరుకి అర్ధం తెలుసా?