Advertisement
సత్యేంద్ర జైన్.. జాతీయ రాజకీయాల్లో ట్రెండింగ్ నేమ్. ఢిల్లీలోని ఆప్ సర్కార్ లో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్నారు. 2017 నాటి హవాలా కేసుకు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసింది. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన 4.81 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను గతేడాది ఏప్రిల్ లో జప్తు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద జైన్ పై సీబీఐ 2017లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దాని ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు కొనసాగించింది.
Advertisement
అయితే.. తీహార్ జైలులో ఉన్న మంత్రి అక్కడ రాచభోగాలు అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గట్టే జైలు గదిలో ఏం జరుగుతోందో తెలిపే వీడియోలు బయటకొచ్చాయి. మనదేశంలో సామాన్యులకు మాత్రమే జైలు శిక్ష కఠినంగా అమలవుతూ ఉంటుంది. సమాజంలో ఒక హోదా, పలుకుబడి ఉన్న వారి లెక్క వేరే విధంగా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టే జైన్ విషయంలో వీడియోలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తమ ప్రభుత్వమే కావడంతో జైలులో జైన్ ఆడింది ఆటగా సాగుతోంది. ఈయన కోసం పది మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Advertisement
పది మందిలో కొందరు రోజూ జైన్ బెడ్ సరి చేయడం, బయటి నుంచి పండ్లు, బట్టలు వంటివి తీసుకురావడం చేస్తున్నారు. మరికొందరు ఆయనకు హౌస్ కీపింగ్ సిబ్బంది మాదిరి వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. తనకు జైనులకుద్దేశించిన సాత్వికాహారాన్ని అధికారులు ఇవ్వడం లేదని, ఇందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ మంత్రి రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే.. న్యాయస్థానం దీన్ని తిరస్కరించింది. జైల్లో పండ్లు, డ్రై ఫ్రూట్లు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
అవినీతిపరులైన ఆప్ నేతలకు జైల్లో వీవీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తోందని బీజేపీ మొదట్నుంచి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. జైన్ కి సకల సదుపాయాలు సమకూర్చిన సుమారు 8 మంది జైలు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ.. ఆయన ఈ రాచభోగాలు ఎలా అనుభవిస్తున్నారని ప్రశ్నిస్తోంది. నిత్యం తన సహచరులతో జైన్ చర్చలు, మాటా మంతీ జరుపుతున్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఇంత జరుగుతున్నా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మాత్రం ఈ వ్యవహారంపై మౌనం దాల్చారు. కొత్తగా తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను నియమించినప్పటికీ ఆయనతోనే జైన్ సమావేశం కావడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. గుజరాత్ ఎన్నికల వేళ జైన్ వ్యవహారాన్ని గట్టిగా వాడేస్తోంది బీజేపీ. పంజాబ్ మాదిరిగా గుజరాత్ లోనూ సత్తా చాటాలని అనేక పథకాలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు కేజ్రీవాల్. అయితే.. జైలులో ఉన్న ఆప్ మంత్రికి రాచభోగాలు అందిస్తున్న విషయంలో బీజేపీ ఆయన్ను కార్నర్ చేస్తోంది.