Advertisement
తెలంగాణలో సంచలనం రేపిన ఇష్యూల్లో ఎమ్మెల్యేల ఎర కేసు ఒకటి. టీఆర్ఎస్ నేతలను బీజేపీ కొనేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోందని మొయినాబాద్ ఫాంహౌస్ లో ప్లాన్ చేసి ముగ్గుర్ని పట్టుకున్నారు. వారిలో వ్యాపారవేత్త నందకుమార్, స్వామీజీలు రామచంద్రభారతి, సింహయాజిలు ఉన్నారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ నేతలతో వీళ్లు కలిసున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అలాగే.. టీఆర్ఎస్ నేతలతో నందకుమార్ దిగిన ఫోటోలు కూడా వెలుగుచూశాయి. ఇరు పార్టీల మధ్య ప్లాన్ మీదంటే మీది అని విమర్శల దాడి కొనసాగింది.
Advertisement
కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటైంది. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు అయితే జారీ చేసింది గానీ, విచారణ జరపలేకపోయింది. కోర్టుల్లో పంచాయితీలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. సింహయాజి బుధవారం బయటకు వచ్చారు. షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఆయన విడుదల ఆలస్యం అయింది. లేకపోతే అంతకుముందే బయటకు వచ్చేవారు.
Advertisement
ఇక గురువారం ఏ1 రామచంద్ర భారతి, ఏ2 నందకుమార్ చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. బయటకు వచ్చిన తరువాత నంద కుమార్ మీడియాతో మాట్లాడారు. 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని.. తనకు ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. కేసు గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడుతానని చెప్పారు. అయితే.. జైలు నుంచి బయటకి రాగానే వీరిద్దరికీ షాక్ ఇచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
రామచంద్రభారతి, నందకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. నందుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. అలాగే రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ ల కేసులో అరెస్ట్ చేశారు. ఇద్దర్నీ బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. డిసెంబర్ 1న ముగ్గురికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది.