Advertisement
ప్రభుత్వ సలహాదారు పాత్ర పోషిస్తున్న దగ్గర నుంచి నటుడు అలీ మాటలోనే కాదు.. చేతలు కూడా దూకుడుగా ఉన్నాయి. జిల్లాల బాట పడుతున్నారు. తాజాగా తిరుపతిలో పర్యటించారు. అయితే.. అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పోటీకి సై అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు.
Advertisement
వైసీపీ గెలుపు ఓకే గానీ, పవన్ కళ్యాణ్ పై పోటీకి సై అనడమే చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా ఇద్దరు వేర్వేరు దారుల్లో ఉన్నా.. నిజ జీవితంలో అలీ, పవన్ మంచి స్నేహితులు. పవన్ హీరోగా చేసిన ఒకట్రెండు సినిమాలు మినహా.. అన్నింటిలోనూ అలీ నటించారు. సినిమా వేరు, రాజకీయం వేరు అని చెబుతున్నా.. వైసీపీకి జనసేన బద్ధ శత్రువుగా ఉంది. పవన్ పై వ్యాఖ్యలు చేయాలి కాబట్టే అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు.
Advertisement
అయితే.. నిజంగా పవన్ పై పోటీ చేస్తే అలీ గెలుస్తారా? అసలు.. ఈయనకు సీటు వస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. అలీకి సీటు ఇవ్వాలంటే.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఝలక్ ఇవ్వక తప్పదు. మరి.. జగన్ ఆ పని చేస్తారా? అంటే.. కష్టమే అని రాజకీయ పండితుల నుంచి వినిపిస్తోంది. ఇటు జనసైనికులు అలీని ఓ ఆటాడుకుంటున్నారు.
సోషల్ మీడియాలో అలీపై పంచ్ లు పేలుతున్నాయి. రకరకాల మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీని ఈమధ్యే సలహాదారుగా నియమించారు జగన్. మూడున్నరేళ్లకు పదవి దక్కిన నీకు.. ఎమ్మెల్యే టికెట్ అప్పుడే ఇస్తారని అనుకుంటున్నావా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.