Advertisement
కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చు గానీ.. రావడం మాత్రం పక్కా! గోపాల గోపాల మూవీలోని ఈ డైలాగ్ బాగా పాపులర్. అయితే.. ఇప్పుడీ డైలాగ్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి కరెక్ట్ గా సూట్ అయ్యేలా ఉంది. భారత అధికారులు అతడ్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయితే.. అధికార పార్టీ నేతలు, అధికారులు మాత్రం నీరవ్.. దేశానికి రాక తప్పదు అని ముందు నుంచి చెబుతున్నారు. ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది.
Advertisement
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.11 వేల కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడినట్టు నీరవ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అతను లండన్ కు పారిపోయాడు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య అప్పగింతలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, చట్టంలోని ఏదో ఒక లొసుగుని అడ్డు పెట్టుకుని కాలం గడిపేస్తూ వస్తున్నాడు. అయితే.. భారత్ కు పంపించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించడంతో అక్కడి కోర్టు మెట్లెక్కాడు నీరవ్.
Advertisement
తనను భారత్ కు పంపవద్దంటూ బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ ఆ దేశ హైకోర్టును కోరాడు. ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేశాడు. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని నేపథ్యంలో తనను భారత్ కు పంపవద్దని వేడుకున్నాడు. కానీ, ఆ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా భారత్ కు పంపించడంలో ఎలాంటి అన్యాయమూ లేదని వ్యాఖ్యానించింది. ఇందులో ఎలాంటి అణచివేత లేదని పేర్కొంది.
హైకోర్టు వ్యాఖ్యలతో నీరవ్ మోడీకి షాక్ తగినట్లయింది. ఇక ఇప్పుడు అతను చచ్చినట్టు భారత్ కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి అవకాశాన్ని కూడా కోల్పోవడంతో దారులన్నీ మూసుకుపోయాయి. ప్రస్తుతం లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్నాడు నీరవ్ మోడీ.