Advertisement
ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగే ఈ సదస్సును ఏపీ సీఎం జగన్, పలువురు వ్యాపార దిగ్గజాలు కలిసి ప్రారంభించారు. ఎడ్వాంటేజ్ ఏపీ అనే నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.
Advertisement
కార్యక్రమంలో ముఖేశ్ అంబానీని జగన్ ఆప్యాయంగా హత్తుకోవడం అందరినీ ఆకర్షించింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయగా.. తర్వాత మంత్రి అమర్ నాథ్ మాట్లాడారు. అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని.. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు.
ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉందని అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదని చెప్పారు.
సీఎం జగన్ మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని మరోసారి ప్రకటించారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందన్నారు. తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని.. అక్కడి నుంచే పాలన సాగిస్తానని చెప్పారు. ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. తమ దగ్గర సులువైన పారిశ్రామిక విధానం అమలవుతోందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు నెంబర్ వన్ స్థానంలో నిలిచామని వెల్లడించారు.
Advertisement
రాష్ట్రంలో మొత్తం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించారు. తద్వారా అతిపెద్ద, అత్యుత్తమ డిజిటల్ నెట్ వర్క్ ను సృష్టిస్తున్నామని చెప్పారు. తమ 4జీ నెట్ వర్క్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో నివసించే వారితో సహా 98 శాతం ఏపీ జనాభాను కవర్ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ తో సహా భారతదేశం అంతటా 2023 చివరిలోపు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
ఏపీ వేంకటేశ్వర స్వామివారి పుణ్యభూమి అని జిందాల్ స్టీల్ అధినేత నవీన్ తెలిపారు. ఇక్కడి ఇన్ ఫ్రా బేస్, వ్యాపార అనుకూల వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించారు. ఆరు నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యధిక జీఎస్‌డీపీ వృద్ధిని ఏపీ సాధించిందని, గత నెలలో స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేశారని గుర్తుచేశారు.
జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. తన స్వరాష్ట్రం విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ను అభివృద్ధి చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ విమానాశ్రయం మొదటి దశలో ఆరు మిలియన్ల ప్రయాణికులకు, అంతిమంగా 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుందన్నారు.
ఈ సమ్మిట్ కు మొత్తం 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వీరందరికీ నోరూరించే ఆంధ్రా వంటకాలను రుచి చూపించారు. ఏపీలోని మూడు ప్రాంతాల్లో ఫేమస్ అయిన వెజ్ అండ్ నాన్ వెజ్ రుచులను వండించారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో.. బొమ్మిడాయిల పులుపు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్, మష్రూం, పన్నీర్, ఆలూ గార్లిక్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీస్, మిర్చీ కా సాలన్, టామాటో పప్పు, మజ్జిగ పులుసు, వడియాలు, కట్ ప్రూట్స్, ఐస్ క్రీం, పేస్ట్రీ, జున్ను మొదలైనవి సర్వ్ చేశారు. శనివారం ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, టమాటా బాత్, హాట్ పొంగల్, ప్లమ్ కేక్, డ్రై కేక్, స్ప్రింగ్ రోల్స్ ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ లో.. రష్యన్ సలాడ్స్, వెజ్ సలాడ్స్, రుమాలీ రోటీ, బటర్ నాన్, ఆంధ్రా చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, గోంగూర రొయ్యల కూర, మటన్ పలావ్, వెజ్ బిర్యానీ, గుత్తి వంకాయ, కరివేపాకు రైస్, కడాయ్ పన్నీర్, బెండకాయ-జీడిపప్పు ఫ్రై, పప్పు చారు, ఉలవచారు మొదలైనవి ఉండబోతున్నాయి.