Advertisement
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో డీజీపీగా అంజనీ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. ఇక రాచకొండ పోలీసు కమిషనర్ గా డీఎస్ చౌహాన్ ను నియమించింది సర్కార్. అక్కడ సీపీగా కొనసాగుతున్న మహేశ్ భగవత్ ను సీఐడీ అడిషనల్ డీజీగా బదిలీ చేసింది.
Advertisement
ఇటు ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ ను నియమించింది. అంజనీ కుమార్ గతంలో నగర పోలీసు కమిషనర్ గా పనిచేశారు. ఈయన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్(పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. బిహార్ రాజధాని పాట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు.
Advertisement
అయితే.. ఐపీఎస్ ల బదిలీలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పోస్టులకు తెలంగాణ వాళ్లు పనికిరారా? అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో దీనిపై స్పందించారు. తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. డీజీపీ సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు కీలక పోస్టింగులు ఇచ్చారని.. వారిలో ఒక్కరు కూడా తెలంగాణ అధికారి లేరంటూ మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యంలో నిన్న పార్టీలో… నేడు పరిపాలనలో మాయమైన తెలంగాణం అని ట్వీట్ చేశారు రేవంత్.
రేవంత్ ట్వీట్ పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కేసీఆర్ పాలనలో బిహారీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. సీఎస్ నుంచి ఇప్పటి డీజీపీ దాకా కీలక హోదాల్లో బిహారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అధికారులే ఉన్నారని.. బిహార్ తెలంగాణగా మారుస్తారా? అంటూ చమత్కరిస్తున్నారు.