Advertisement
ఈమధ్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడంతో పొత్తులపై తెగ ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికలకు జనసేన, టీడీపీ, బీజేపీ కలవడం ఖాయమని వార్తలు వచ్చాయి. 2014 సీన్ 2024కు రిపీట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ, ఇది సెట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 2019 ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీపై సమర శంఖం పూరించారు చంద్రబాబు. అదే సమయంలో జనసైన ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో నిలబడింది. ప్రస్తుతం జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నాయి. కానీ, ఇందులోకి టీడీపీని రానిచ్చే ప్రసక్తే లేదంటున్నాయి బీజేపీ వర్గాలు.
Advertisement
ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ డియోధర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో మాత్రం భవిష్యత్తులో కలిసేది లేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించినట్లు తెలిపారు. టీడీపీ, వైసీపీ రెండూ దొంగల పార్టీలేనని విమర్శించారు.
Advertisement
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు సునీల్. పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ వ్యవహారాన్ని తాము అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. రోడ్ మ్యాప్ పై మీడియాతో పవన్ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బీజేపీ నేతలు చాలా మంది పవన్ తో మాట్లాడారని చెప్పారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
ఇక మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారామయణ వ్యవహారాన్ని తాము సీరియస్ గా తీసుకోవట్లేదన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ మధ్య ఎలాంటి విభేధాలు లేవని వెల్లడించారు. ఇవేమీ అంత పెద్దగా పట్టించుకునే వ్యాఖ్యలు కూడా కాదని చెప్పారు సునీల్.