Advertisement
రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పైనే అయింది. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని పంచాయితీలు మిగిలిపోయినా.. ఎక్కడి పాలన అక్కడే జరుగుతోంది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ప్రధాన ఆదాయం వ్యవసాయం. పలు రకాల పంటలు పండిస్తున్నా.. ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు రైతులు. ఏడాదికేడాది పెరుగుతున్న పంట శాతం ప్రభుత్వాలకు భారంగా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ ఓ అడుగు ముందుకేసి వరి కాకుండా ఇతర పంటలను పండించాలని రైతులకు పలు సూచనలు చేస్తోంది.
Advertisement
అందరూ వరి పండిస్తే కొనుగోలు కష్టమని ఇతర పంటలపై దృష్టి సారించాలని.. గతేడాది నుంచి రైతులకు అవగాహన కల్పిస్తోంది కేసీఆర్ సర్కార్. ఈ విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య గొడవలు జరిగాయి. రైతులు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. కేవలం వరి మాత్రమే పండే భూముల సంగతేంటని నిలదీశారు. వివాదాలు కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం సదస్సులు నిర్వహిస్తూ అధికారులతో రైతులకు అన్నీ వివరిస్తోంది. అందరూ వరి వేస్తే కొనడం కష్టమని.. ఇతర పంటలపై దృష్టి సారించాలని ప్రజెంటేషన్లు ఇస్తోంది.
Advertisement
తెలంగాణ సర్కార్ బాటలోనే ఇప్పుడు జగన్ ప్రభుత్వం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం ఫాంలో అగ్రిటెక్ సదస్సును ప్రారంభించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులందరూ వరి పండిస్తే కొనడం కష్టమని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. వరి పండిస్తేనే రైతు, లేదంటే కాదన్న ఆలోచన నుంచి బయటకు రావాలని కోరారు. సీజన్ కు తగ్గట్టుగా సాగునీరు సరఫరా చేస్తుండడంతో రైతులందరూ వరిని సాగు చేస్తున్నారని, ఆ పంటంతా కొనేందుకు ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు.
రైతులు వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, ఇతర పంటలను సాగు చేయాలనేది ఏపీ సర్కార్ వినతి. అయితే.. రాష్ట్రంలో పత్తి సాగు పడిపోయింది. తెలంగాణ నుంచి ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నారు. ఆ పంట కూడా కాకుండా.. ఇతర పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.