Advertisement
ధర్మేంద్ర ప్రధాన్.. బీజేపీ కీలక నేత. పైగా కేంద్రమంత్రిగా చేస్తున్నారు. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి. అందర్నీ సమానంగా చూడాలి. కానీ, ఆయన కాస్త అతి చేశారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బీజేపీకి దగ్గరగా ఉన్న వైసీపీ నేతలు కూడా ఎటాక్ మొదలు పెట్టారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ఎలాగూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
Advertisement
అసలేం జరిగిందంటే..
ఒడిశా-ఆంధ్రా సరిహద్దులోని కొఠియా పంచాయతీలో పట్టు చేనేరులో ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. అక్కడి అభివృద్ధి పనులు పరిశీలించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ కి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఏపీ పోలీసులను గో బ్యాక్ అంటూ ఆదేశించారు. ఆంధ్రా పోలీసులకు ఇక్కడేం పని అని రెచ్చిపోయారు. కొఠియాకు చెందిన 21 గ్రామాలు ఇరు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, ఏపీ పోలీసులు వివరణ ఇవ్వగా.. కొఠియా ఆంధ్రాకి చెందినది కాదు.. కేవలం ఒడిశాకి మాత్రమే అని కేకలు వేశారు. ఆంధ్రా పోలీస్ గో బ్యాక్ అని అన్నారు. ఆయనకు అనుచరులు కూడా తోడయి నినాదాలు చేశారు.
Advertisement
కేంద్రమంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిలో ఉండి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ వివాదంపై కేంద్రమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం అవివేకం అనిపించుకుంటుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ దేశానికి మంత్రని, అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూడాలన్నారు. కేవలం ఒడిశాపై ప్రేమ చూపిస్తూ.. ఆంధ్రా గో బ్యాక్ అనడం విచారకరమని మండిపడ్డారు. వెంటనే కేంద్రమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని.. ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆంధ్రా అధికారులను గో బ్యాక్ అనడం దుర్మార్గమన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ధర్మేంద్ర ప్రధాన్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఇలాంటి వ్యక్తుల వల్ల కేంద్రానికి నష్టం జరుగుతుందని.. మోడీ స్పందించి వెంటనే ఆయన్ను కేంద్రమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నారాయణ.