Advertisement
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు యుద్ధం సాగుతోంది. మొన్నటిదాకా మునుగోడు చుట్టూ సాగిన ఈ డైలాగ్ వార్ ఇప్పుడు కవిత వర్సెస్ అరవింద్ మధ్య జరుగుతోంది. టీఆర్ఎస్ మీటింగ్ సందర్భంగా కవితను బీజేపీలోకి లాగేందుకు సంప్రదింపులు జరిపారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపై స్పందించిన అరవింద్.. బీజేపీతో కాదు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కవిత సంప్రదింపులు జరిపారని.. ఈ విషయాన్ని ఆపార్టీలోని కీలక వ్యక్తి తనకు చెప్పాడని అన్నారు. అంతే.. అగ్గి రాజుకుంది.
Advertisement
శుక్రవారం కవిత ప్రెస్ మీట్ అని మీడియా వర్గాలకు మెసేజ్ వెళ్లిపోయింది. ఓవైపు లిక్కర్ కేసు పంచాయితీ నడుస్తుండగా.. కవిత ఏం మాట్లాడతారా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే.. కవిత మీడియా సమావేశానికి ముందు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి జరిగింది. టీఆర్ఎస్ జెండాలు పట్టుకున్న కొందరు ఆయన ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతకుముందు అరవింద్ దిష్టిబొమ్మను ఆయన ఇంటి ముందే తగులబెట్టారు. ఇటు ప్రెస్ మీట్ లో కవిత ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఓవర్ చేస్తే చెప్పుతో కొడతా అని ఎంపీకి వార్నింగ్ ఇచ్చారు.
Advertisement
అరవింద్ ను ఎన్నికల్లో వెంటబడి ఓడిస్తాని సవాల్ చేశారు కవిత. ఆయన ఎక్కడ పోటీచేసినా ఓడిస్తానన్నారు. రాజకీయాలు చేయండి గానీ.. దిగజారి ప్రవర్తించవద్దని హితవు పలికారు. తాను పార్టీ మారతానని ప్రచారం చేస్తే గట్టిగా బుద్ధి చెబుతానని.. అంతగా అనుమానం ఉంటే ఖర్గేను అడగండిని చెప్పారు. బీజేపీలో చేరాలని తనను అడిగారని.. కొన్ని ప్రతిపాదనలు కూడా ముందుంచారని వివరించారు. అలాగే పసుపు రైతులకు అన్యాయం చేస్తున్నారని అరవింద్ పై కేసులు పెట్టబోతున్నామని అన్నారు.
కవిత కామెంట్స్ పై వెంటనే మీడియా ముందుకొచ్చారు అరవింద్. మాటకు మాట బదులిచ్చారు. పోటీకి సై అన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు కవిత ప్రయత్నాలు చేశారని.. తాను చెప్పినందుకే దాడి చేస్తే మరి బీజేపీ నుంచి కవితకు ఆఫర్ వచ్చిందని కేసీఆరే అన్నారు.. మరి ఆయనను చెప్పుతో కొట్టావా? అని ప్రశ్నించారు. కవిత తనపై చీటింగ్ కేసు వేయడం కాదు.. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి నెరవర్చని ఆమె తండ్రిపై వేసుకోవాలని సూచించారు. 178 మంది పసుపు రైతులు నిజామాబాద్ లో నామినేషన్లు వేస్తే అందులోని 71 మంది బీజేపీ కండువాలు కప్పుకున్నారని చెప్పారు. రైతులంతా బీజేపీ వైపు చూస్తుంటే తనమీద చీటింగ్ కేసు ఏం పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి కుల అహంకారం పెరిగిపోయిందని, అందుకే తన ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఇంట్లో తన తల్లితో పాటు మహిళా స్టాఫ్ పై దాడి చేశారని ఆరోపించారు. కవిత ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని ఆమె రాజకీయ జీవితం ముగిసిందన్నారు అరవింద్.