Advertisement
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటన చుట్టూనే తిరుగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. ఈకేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఎంపీ ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. వారందరినీ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
Advertisement
నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది తిరుపతి వర్మ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరఫున వాదనలు వినిపించారు. ఆయన మాటలకు ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనపై అరవింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరఫున పర్సనల్ అడ్వకేట్లు, మేనేజర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
Advertisement
50 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు విజయలక్ష్మి. ప్రధాన గేటు పగులగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్‌ఎస్ జెండాలు, కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారని వివరించారు. ఈ కేసులో దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. దాడికి పాల్పడిన 50 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేయగా.. తొమ్మిది మందినే పట్టుకున్నారు పోలీసులు.
పట్టుకున్న వారందరినీ కోర్టులో హాజరు పరిచారు. బెయిల్ విషయంలో వాదనలు జరిగాయి. నిందితుల తరఫు లాయర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం వారికి బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది.