Advertisement
హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఎంఐఎం పార్టీ దేశమంతా విస్తరించాలని చూస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కాస్త పట్టు సాధించింది. అయితే.. దేశంలో కొన్ని అంశాల గురించి బీజేపీని టార్గెట్ చేస్తుంటారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. ఇప్పుడు ఆయన దొరికిన అస్త్రం.. బాల్య వివాహాలు. బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తనదైన రీతిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
Advertisement
ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన అసోంను పాలిస్తోంది బీజేపీ. అక్కడి హిమంత శర్మ సర్కార్ ఈమధ్య ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య వివాహాలను అరికట్టడంపై కఠిన చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4వేలకు పైగా బాల్య వివాహాల కేసులు నమోదయ్యాయి. 2వేల మందికిపైగా కటకటాల పాలయ్యారు. వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు.
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 4వేలకు పైగా కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం శర్మ స్పందిస్తూ.. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని అస్సలు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునేవారిపై, పోక్సో చట్టం కింద అభియోగాలు మోపుతున్నట్టు తెలిపారు. ఇలాంటి విషయాల్లో వివాహానికి మద్దతు తెలిపే మత పెద్దలు, పురోహితులు తదితరులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం.
అసోం సర్కార్ నిర్ణయంపై తనదైన రీతిలో సెటైర్లు వేశారు అసదుద్దీన్ ఒవైసీ. ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు మగవాళ్లను అరెస్ట్ చేస్తున్నారు.. మరి, వారి భార్యల బాగోగులు ఎవరు చూస్తారు.. సీఎం చూసుకుంటారా? అని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో అసోంలో బాల్య వివాహాలను బీజేపీ అరికట్టలేకపోయిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు చేశారు అసద్.