Advertisement
బీజేపీని టార్గెట్ చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎప్పుడూ ముందుంటారు. రాష్ట్రాల్లో జరుగుతున్న అనేక ఘటనలపై రియాక్ట్ అవుతూ.. ఆయా ప్రభుత్వాల తీరును ఎండగడుతుంటారు. ఈమధ్యకాలంలో పలు ఘటనలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఈక్రమంలోనే ఆయన ఇంటిపై దాడి జరిగిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement
హర్యానాలోని భివానీలో ముస్లిం యువకులపై దాడి చేసి హత్య చేయడంపై రెండు రోజుల క్రితం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసద్. బీజేపీ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. దాడులకు పాల్పడే గోరక్షకులను బీజేపీ కాపాడుతోందనీ, దీనిపై హర్యానా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జునైద్, నసీర్ మరణాలు అమానుషమని, ఆ యువకులను గోరక్షక్ ముఠా చంపిందని, వారికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో వ్యవస్థీకృత ముస్లిం విద్వేషం రాజ్యమేలుతోందని అసహనం వ్యక్తం చేశారు.
అలాగే, ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ల రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. తల్లీకూతుళ్ల ప్రాణాలను తీసిందని ఆరోపించారు ఒవైసీ. రాజ్యాంగంతో కాకుండా బుల్డోజర్ తో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇవన్నీ చేయడం వల్ల వారు రాజకీయంగా ఏమీ పొందలేరని అన్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఆక్రమణల కూల్చివేత సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని తల్లీకూతుళ్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిలో యోగి సర్కార్ పై విరుచుకుపడ్డారు ఒవైసీ.
Advertisement
ఇటు కర్ణాటకలో కొనసాగుతున్న సావర్కర్, టిప్పు సుల్తాన్ కాంట్రవర్సీపైనా స్పందించారు. తాను టిప్పు సుల్తాన్ కు మద్దతు ఇస్తానని, అలా ఇస్తే తనను చంపేస్తారా అంటూ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కుల్ని ఇచ్చిందని.. ఎవరికి నచ్చిన వారిని వారు గౌరవించుకుంటారని అన్నారు. కానీ, బీజేపీకి అవి గిట్టడం లేదన్న ఒవైసీ.. టిప్పు సుల్తాన్ ను వ్యతిరేంచేవారు సమాజంలో విధ్వేషాలు రెచ్చగొడుతున్నారు, అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఇలా వారం రోజుల్లో అనేక ఘటనలపై స్పందించారు అసదుద్దీన్. సీన్ కట్ చేస్తే.. తాజాగా ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దీనిపై ఒవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాడిలో తన ఇంటి అద్దాలు ద్వంసం అయినట్లుగా తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు తన ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన నివాసానికి వెళ్లి ఆధారాలు సేకరించింది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయనంటే గిట్టనివారే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.