Advertisement
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హాట్ టాపిక్ అంశాల్లో ఎమ్మెల్యేల ఎర కేసు ఒకటి. రోజుకో అప్డేట్ తో ఈ కేసు ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. న్యాయవాది శ్రీనివాస్ రెండు రోజుల విచారణకు హాజరయ్యారు. ఆయనకు పలు రకాల ప్రశ్నలు వేశారు సిట్ అధికారులు. విచారణ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్.. తనకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే ఎమ్మెల్యేల ఎర కేసుతోనూ సంబంధం లేదని వెల్లడించారు. సింహయాజీ స్వామితో మాత్రమే పరిచయం ఉందని.. ఆయనపై ఉన్న అభిమానంతోనే టికెట్ బుక్ చేసినట్టు తెలిపారు. సిట్ అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
Advertisement
ఇక ఈ కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు, కేరళకు చెందిన తుషార్, జగ్గు స్వామికి సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. షామీర్ పేటలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో బండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్ సంతోష్ కి సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై సీరియస్ అయ్యారు. ఎవరో ఏదో మాట్లాడితే సంతోష్ కు ఏం సంబంధమని అడిగారు.
Advertisement
సిట్ నోటీసులకు తాము భయపడేది లేదన్న బండి.. బీఎల్ సంతోష్ కు ఫాంహౌస్ లు, బ్యాంకు అకౌంట్లు లేవని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని ఆయన కోరుకోలేదని.. తమ ప్రచారక్ ల జోలికి వస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘‘బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారు.. ఆయనకు మీ లెక్క ఆస్తిపాస్తుల్లేవు. కుటుంబం లేదు. విదేశాల్లో పెట్టుబడుల్లేవు. బ్యాంకు ఖాతాల్లేవు. ఎవరో చెప్పారని కేసులు పెట్టి అవమానిస్తారా? నీ రాజకీయ లబ్ది కోసం, నీ కుటుంబం కోసం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రచారక్ వ్యవస్థనే కించపరుస్తావా? అసలు మనిషివేనా? ఖబడ్దార్ కేసీఆర్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని నిప్పులు చెరిగారు.
దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తున్న ప్రధాని మోడీపైనా, దేశం, ధర్మం కోసం కుటుంబాల్లేకుండా సేవ చేస్తున్న ప్రచారక్ లపై కేసీఆర్ అనుచిత ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు సంజయ్. బీఎల్ సంతోష్ కి నోటీసులు ఇస్తే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఆయన కుటుంబాలను వదిలేసి దేశ రక్షణ కోసం పని చేసే వ్యక్తుల్లో ఒకరని వెల్లడించారు.