Advertisement
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. ఈ ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. డీహెచ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను రోడ్లపై ఉరికించి ఉరికించి కొట్టినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
Advertisement
ప్రజల ఆరోగ్యం గురించి చూసుకోవాల్సిన వ్యక్తి.. ఒక మత సభలలోకి పోయి కరోనా నుంచి ఆ దేవుడు కాపాడాడని అనడం కరెక్ట్ కాదన్నారు బండి. ఆ దేవుడు ఉన్న దేశాలు అభివృద్ది చెందితే.. శ్రీనివాసరావు ఇక్కడెందుకు ఉంటున్నాడు?.. అక్కడకే పోయి బతకొచ్చుగా అంటూ చురకలంటించారు. ఆయనది ఒక బతుకేనా? ప్రభుత్వ అధికారి అయి ఒక మతానికి కొమ్ముకాయడానికి సిగ్గుందా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివారు పుట్టడం వల్లే ఈ దేశం అవమానాలకు గురవుతుందని వ్యాఖ్యానించారు.
Advertisement
భద్రాద్రిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాస్ క్రీస్తును కీర్తిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే చివరకు వివాదానికి దారి తీశాయి. దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని.. క్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని అన్నారు డీహెచ్. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందని తెలిపారు. అంతటితో ఆగకుండా.. ఏసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలని పిలుపునిచ్చారు.
డీహెచ్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన్ను సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ కూడా డిమాండ్ చేస్తోంది. క్రీస్తు వల్లే కరోనా అంతమైందని.. వైద్యులిచ్చిన మెడిసిన్స్ వల్ల కాదని డీహెచ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి.. మతాలను ప్రేరేపించేలా, కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసేలా, హిందువులను కించపరిచేలా మాట్లాడటం సమంజసం కాదని తీవ్రంగా హెచ్చరించింది. క్రీస్తు మాత్రమే దైవం.. మిగతా దేవుళ్ళందరూ గ్రాఫిక్స్ అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది.