Advertisement
తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని రేవంత్ రెడ్డి తిట్టిపోస్తూ ఉంటారు. కాదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బండి సంజయ్ అంటుంటారు. అసలు.. బీజేపీ, కాంగ్రెస్ తమకు పోటీనే కాదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని మాటల తూటాలు పేలుస్తుంటారు. అయితే.. ఒక్కోసారి భిన్నధృవాలైన ఈ పార్టీల నేతలు సంతోషంగా పలకరించుకుంటూ కనిపిస్తారు.
Advertisement
కేంద్రం 2023 బడ్జెట్ ను పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పార్టీల నేతలు ఆప్యాయంగా పలకరించుకుంటూ కనిపించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరిని చూసి స్నేహమంటే ఇదేరా?.. దోస్త్ మేరా దోస్త్ అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.
Advertisement
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి కలుసుకున్నారు. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఒకేసారి తారసపడ్డారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కాసేపు అందరూ నవ్వుతూ పలకరించుకున్నారు.
ఇటు బీఆర్ఎస్ ఎంపీ కేశవరావును కూడా రేవంత్ రెడ్డి కలిశారు. తరచూ ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకునే వీరంతా సరదాగా సంభాషించుకోవడం ఆసక్తికరంగా మారింది. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు వెళ్తుండగా ఒకేసారి ఈ నేతలు ఎదురుపడ్డారు.