Advertisement
మునుగోడు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉంది బీజేపీ. అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రతీ గ్రామాన్ని చుట్టేస్తున్నారు. ఇటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన రీతిలో ప్రభుత్వంపై పంచ్ డైలాగులు విసురుతున్నారు. తాజాగా సంస్థాన్ నారాయణపూర్ మండలంలో ప్రచారం నిర్వహించగా.. ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శివాలయం నుండి రామాలయం దాకా రాజగోపాల్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు సంజయ్.
Advertisement
ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గడీల పాలనలో బందీ అయ్యానని తెలంగాణ తల్లి ఆత్మ గోషిస్తోందని అన్నారు. ఆ గడీల పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలంటూ పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించి, బీజేపీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే పేదోళ్ల బతుకులు ఆగమవుతాయని, ఓట్లను మాత్రం అమ్ముకోవద్దని కోరారు.
Advertisement
తెలంగాణ ప్రజల భవిష్యత్ మునుగోడు జనం చేతుల్లో ఉందన్నారు సంజయ్. కేసీఆర్ పాలనలో నలిగిపోతున్న తెలంగాణ పేదలను సాదుకుంటారో? గొంతు పిసికి సంపుకుంటారో? తేల్చుకోవాలని కోరారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే హీరో.. మిగిలిన పార్టీ అభ్యర్థులు ప్రజలను ఇబ్బంది పెట్టే విలన్లు.. మరి హీరో కావాలో? విలన్లు కావాలో? ఆలోచించాలన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏనాడూ మోసం చేయలేదని.. దగా చేయలేదని.. కమీషన్లు తీసుకోలేదని.. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు.
మునుగోడు ప్రజల సమస్యలను, నియోజకవర్గం అభివృద్ధిని కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్లే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. మన దీపావళి నవంబర్ 6న.. బీజేపీకి ఓట్లు వేయండి.. వేయించండి అని ఓటర్లను కోరారు బండి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే చౌటుప్పల్ నుంచి నారాయణపూర్ వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టారని, గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించారని చెప్పారు. కేసీఆర్ కులాలు, సంఘాల పేర్లతో ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు సహా అందర్నీ గుంపులు గుంపులుగా వచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.40 వేలు ఇస్తున్నారని.. ఆ డబ్బును తీసుకొని హుజూరాబాద్, దుబ్బాకలో మాదిరిగా బీజేపీకి ఓటేయాలని కోరారు. గొర్రెల పైసలియ్యోద్దని తాను ఈసీకి లేఖ రాయలేదని ప్రమాణం చేస్తా కేసీఆర్ చేస్తారా? అని సవాల్ చేశారు సంజయ్.