Advertisement
పార్టీ నేతల సమక్షంలో ఎంతో అట్టహాసంగా భారత రాష్ట్ర సమితి వేడుకల్ని నిర్వహించారు ఆపార్టీ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా దేశానికి తెలంగాణ మోడల్ ను పరిచయం చేస్తామన్నారు. దేశంలో రైతు రాజ్యం తీసుకొస్తామని తెలిపారు. అయితే.. బీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి బండారం బయట పెడతానని.. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి.. ఇక దేశాన్ని మోసం చేయాలనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. మిషన్ భగీరథ పైపులు కేసీఆర్ ఫ్యాక్టరీ నుంచే వస్తాయని.. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఎన్ని ఇండ్లు ఇచ్చింది..? డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని ఇచ్చారో కేసీఆర్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చి ప్రజలను బిచ్చగాళ్లను చేయడమేనా తెలంగాణ మోడల్ అని ప్రశ్నించారు. ఒకే కుటుంబం లక్ష కోట్లు దోచుకోవడమెలా.. అనేది దేశానికి చాటిచెప్పడమేనా తెలంగాణ మోడల్ అంటే అని నిలదీశారు. ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు.ఇచ్చిన హామీ మేరకు ఇటీవల 1.46 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి తోసిపుచ్చారు. చినుకు పడితే అంధకారమయ్యే హైదరాబాద్ పవర్ ఐలాండ్ గా మారిందనడం హస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
టీఆర్ఎస్ రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా అని టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాలా బయల్దేరారని ఆరోపించారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు.. రాష్ట్రంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. మిషన్ భగీరథ పథకం నీళ్లు ఏ ఇంటికైనా వస్తున్నాయా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామని సంజయ్ అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైందని కేసీఆర్ ను నిలదీశారు. ముత్యంపేట షుగర్ పరిశ్రమ నడవాలంటే బీజేపీ రావాలన్న బండి.. నిలువ నీడ లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని.. ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఇస్తోందన్నారు.