Advertisement
పాతబస్తీలో పట్టు కోసం బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ, అక్కడ ఎంఐఎంను కాదని వేరే పార్టీ గెలిచింది లేదు. అయితే.. దీనిపై బీజేపీ మొదట్నుంచి అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ వస్తోంది. నకిలీ ఓటర్ కార్డులు చాలానే ఉన్నాయని.. ఓల్డ్ సిటీలో తీవ్రవాదులకు కూడా చోటు ఇస్తున్నారనే ఆరోపణలు చేస్తుంటుంది. అయితే.. తాజాగా వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల బాగోతం.. బీజేపీకి అస్త్రంగా మారింది.
Advertisement
సరైన ధృవీకరణ పత్రాలు లేకుండానే వేలల్లో జనన, మరణ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ జారీ చేసింది. కంప్యూటర్ ఆపరేటర్లు, ఏఎంసీఏ, ఎంఓహెచ్, ప్రధాన కార్యాలయంలోని అధికారులు దీనికై చేతివాటం ప్రదర్శించినట్టుగా అనుమానిస్తున్నారు. మొత్తం 31 వేల బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ రద్దు చేసింది. పరిస్థితి నుండి ఎలా గట్టెక్కాలో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
2020 మార్చి నుంచి డిసెంబర్ 2022 వరకు నాన్ అవేలెబిలిటీ కింద 27,328 బర్త్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. అలాగే, 4,126 డెత్ సర్టిఫికేట్స్ జారీ చేశారు అధికారులు. ఇందులో అత్యధికంగా మెహదీపట్నం సర్కిల్ లో 5,877, చార్మినార్ సర్కిల్ లో 3,949, బేగంపేట్ సర్కిల్ పరిధిలో 2,821, సికింద్రాబాద్ సర్కిల్ లో 1,758 బర్త్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. డెత్ సర్టిఫికేట్స్.. బేగంపేట్ సర్కిల్ లో అత్యధికంగా 409, గోషామహల్ సర్కిల్ లో 329, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్ర నగర్, మెహదీపట్నం, కార్వాన్ సర్కిళ్లలో 220 నుంచి 240 జారీ చేసినట్టు తేలింది. నాన్ అవేలెబిలిటీలో సంబంధిత పత్రాలకు బదులు తెల్ల కాగితాలు పెట్టినా కొంతమంది అధికారులు జారీ చేయడమే వివాదానికి కారణమైంది.
Advertisement
ఈ ఇష్యూని బీజేపీ గట్టిగా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, పొరుగుదేశాల నుంచి వచ్చి ఫేక్ సర్టిఫికెట్లతో ఇక్కడ ఉంటున్నారని ఆరోపించారు. కొందరు కార్పోరేటర్ల ఇష్టా రాజ్యం నడుస్తోందని, రివ్యూలు, ప్రక్షాళన లేకుండా జీహెచ్‌ఎంసీ నడుస్తోందని ఆరోపించారు. వేలకు వేల నకిలీ ధృవీకరణ పత్రాలు ఇస్తుంటే జీహెచ్‌ఎంసీ కనీసం రివ్యూ నిర్వహించదా అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీలో ఉన్నదంతా దళారీ వ్యవస్థే అని, డబ్బు విసిరేస్తే ఏ పని అయినా జరుగుతోందన్నారు బండి.
ఇక రాజాసింగ్ స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు 27 వేల బర్త్ సర్టిఫికెట్స్ తొలగించారని ఇందులో ఎక్కువ భాగం పాతబస్తీకి చెందినవేనని తెలిపారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల వెనుక ఎంఐఎం పార్టీ హస్తం ఉందని, ధ్రువపత్రాలను చట్టవిరుద్ధంగా తయారు చేయించారని ఆరోపించారు. ఇది షాదీముబారక్ స్కీమ్ కోసం జరిగిన స్కామ్ అని ఆరోపించారు. అలాగే, రోహింగ్యాలకూ ఫేక్ సర్టిఫికెట్లతో మేలు చేసే పన్నాగమని ఆరోపించారు. పాక్, బంగ్లాదేశీయులకూ నకిలీ సర్టిఫికెట్లతో ఆశ్రయం ఇస్తున్నారని అన్నారు. ఇందులో టెర్రరిస్టులు కూడా ఉండొచ్చని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు.