Advertisement
తెలంగాణపై బీజేపీ ఎంతో ఫోకస్ పెట్టింది. బండి సంజయ్ సారథ్యంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి.. గ్రామగ్రామాన విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. అలా.. ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు సంజయ్. ప్రతీ ఒక్కర్నీ పలకరించుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఐదో విడత యాత్ర చేస్తున్న ఆయన.. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఎలాంటి వ్యూహాలు రచించాలన్నది ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే పార్టీ నేతలు, కార్యకర్తలను ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణపై వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి. ఇది బీజేపీ ప్లానే అని ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.
Advertisement
టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సీబీఐకి ఎంట్రీ లేకపోయినా.. అధికారులు ఏది చేయాలో అది చేసేస్తున్నారు. వరుస తనిఖీలు, విచారణలతో టీఆర్ఎస్ లో రోజురోజుకీ కలవరం ఎక్కువైంది. ముఖ్యంగా పార్టీకి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, సంస్థలను టార్గెట్ చేయడం.. బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ, కమలనాథులు మాత్రం తమకేం సంబంధం లేదని చెబుతున్నారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయని.. అవినీతికి పాల్పడకపోతే అంత ఉలుకెందుకని ప్రశ్నిస్తున్నాయి. ఓవైపు పార్టీని జనాల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ.. ఇంకోవైపు ప్రతిపక్షాలను తనదైన స్టయిల్ లో టార్గెట్ చేస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు.
Advertisement
ఇప్పుడు తెలంగాణ ఆపరేషనే త్వరలో ఏపీలో కూడా ఊపందుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ట్రైలర్ గా ఇద్దరు నేతల ఇళ్లల్లో సోదాలకు దిగింది ఐటీ. వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, వల్లభనేని వంశీల ఇళ్లల్లో తనిఖీలు జరిపారు ఐటీ అధికారులు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కొందరు వైసీపీ నేతలే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఈడీ. జగన్ పార్టీ బీజేపీతో సన్నిహితంగా ఉన్నా.. నేతలు మాత్రం తమది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అనుబంధమేనని అంతకుమించి ఏమీ లేదని అంటున్నారు. అయినా.. బీజేపీని బలోపేతం చేసుకోవాలంటే.. వైసీపీతో ఎప్పటికైనా నష్టమే అని గ్రహించిన కమలం పెద్దలు ఆపరేషన్ ఏపీని మొదలు పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.
టీడీపీ హయాంలో సాగిన స్కిల్ డెవెలప్ మెంట్ స్కాంపై ఇప్పటికే ఈడీ ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కాంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఐటీ ఎంటర్ అయింది. ఇలా వైసీపీ, టీడీపీ నేతల వ్యాపార కార్యకలాపాలపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయని సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.