Advertisement
తెలంగాణలోనే కాదు దేశమంతా చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ ఖమ్మం సభ. దానికి కారణం కేసీఆర్ తో పాటు నాలుగు రాష్ట్రాల సీఎంలు, ఇద్దరు జాతీయ నేతలు పాల్గొనడం. ముందుగా ఊహించినట్టే బీఆర్ఎస్ వర్గాల ప్రకారం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. ఆపార్టీ ముఖ్యనేతలంతా కేసీఆర్ పై విరుచుకుపడుతూ.. సభ ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు.
Advertisement
ఎవరెవరు ఏమన్నారంటే..?
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణలో కరెంట్ ఎప్పుడూ వస్తుందో.. ఎప్పుడో పోతుందో ఎవరికీ తెలియదు. డిస్కమ్ లకు ఇంకా బకాయిలు చెల్లించటం లేదు. అంబేద్కర్ జయంతి, వర్థంతికి రాని కేసీఆర్ దళితులకు ఏం మేలు చేస్తారు. తెలంగాణలో ఎంత మందికి దళిత బంధు ఇస్తున్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ఖమ్మం సభకు కుమార స్వామి, నితీశ్ కుమార్ రాలేదు. ఇప్పుడు వచ్చిన నేతలు మళ్లీ రారు. ఖమ్మం సభకు వచ్చిన నేతలు స్కాముల్లో ఉన్నారు. ఒకరు లిక్కర్ స్కాం, మరొకరు గోల్డ్ స్కాం, ఇంకొకరు మైన్ స్కామ్ లో ఉన్నారు. దేశంపై సీఎం కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారు. గోదావరిలో ఉన్న నీటి లభ్యతను సరిగా వాడుకోవటం చేతకాని కేసీఆర్.. కొత్త ప్రాజెక్టులు కడతానని ప్రగల్భాలు పలుకుతున్నారు. లిక్కర్ స్కాం డబ్బులు పంచుకునేందుకు జాతీయ నేతలు ఖమ్మం వచ్చారు.
Advertisement
ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ పతనం ప్రారంభం అయింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే అది స్టార్ట్ అయింది. దళితులను వంచించి రాజ్యాధికారంలోకి వచ్చిన కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. దళితుల పేరుతో కపట ప్రేమ చూపిస్తున్నారు. రాష్ట్రంలో సొంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే దళితబంధు ఇస్తున్నారు. రాష్ట్రంలో దోచుకున్నది సరిపోక ఇప్పుడు దేశంపై కల్వకుంట్ల కుటుంబం కన్ను పడింది. సామాన్య ప్రజలను, ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ మోసం చేశారు. ఆర్టీసీ వ్యవస్థలో 3 వంతులు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటైజేషేన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పక్కకు పెట్టి చెరుకు రైతుల కడుపు కొట్టిన ఘనుడు కేసీఆర్. ఇక విద్యను వ్యాపారం చేసి అనుచరులకు అప్పగించి కోట్లు దండుకుంటున్నారు.
డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢిల్లీలోనే కాదు.. గల్లీలో కూడా ఉండకుండా చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం ఇవ్వలేని కేసీఆర్.. దేశాన్ని పాలిస్తానంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. సీఎం మాటలు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరంలేదు. ఖమ్మం సభలో ఏమి మాట్లాడాలో అర్థంకాక సమయం అయిపోయిందని హెలికాప్టర్ తో పెద్ద సమస్య అంటూ ప్రసంగం మధ్యలో అనడం ప్రజల దృష్టి మళ్లించడమే. ఉచిత విద్యుత్ తెలంగాణాకే దిక్కులేదు దేశమంతా ఇస్తాడట. బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి ప్రసంగిస్తే కేంద్రం నుంచి వచ్చి హిందీలో లొడలొడా మాట్లాడుతారని విమర్శించిన కేసీఆర్.. ఖమ్మం సభకు వచ్చిన నాయకులు ఏ భాషలో మాట్లాడారో చెప్పాలి.
బూర నర్సయ్య గౌడ్, బీజేపీ సీనియర్ నేత
ఖమ్మం సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి స్పీచ్ లో పస లేదు. తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి? రాజకీయాలకు, బర్గర్లకు పొంతన ఏముంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారు. కేవలం స్వలాభం కోసమే కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయి. ఎన్నికల కోసం రూ.200 కోట్ల నిధులతో ‘కంటి వెలుగు’ కార్యక్రమం పెట్టారు. కంటి వెలుగు కేంద్రంలో ఏ ఒక్క కంటి డాక్టర్ కూడా లేరు. సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో సంవత్సరానికి 9 వేల ఆపరేషన్లు చేస్తున్నారు.రాష్ట్రంలో దళితులపై ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారు.