Advertisement
సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ధర్నాలు, దీక్షలు అంటూ హడావుడి చేస్తోంది. బీజేవైఎం ముట్టడి కార్యక్రమాలతో మైలేజ్ వచ్చినట్టు భావించి మరిన్ని నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
Advertisement
ఈనెల 25న మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించింది బీజేపీ. ఇందిరా పార్క్ వేదికగా ఈ ధర్నా చేపట్టనున్నట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ.. ‘‘మా నౌకర్లు మాకు కావాలి’’ అనే పేరుతో కమలనాథులు దీక్షకు దిగనున్నారు. కాంగ్రెస్ తో సహా ఇతర రాజకీయ పార్టీల కంటే ముందుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చనీయాంశం చేయడంలో విజయం సాధించాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
ఇప్పటికే బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని హైలైట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసులు పంపినా కూడా మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. సిట్ నోటీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పాల్పడి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను గల్లంతు చేశారన్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు చేస్తూ విపక్షాలకు నోటీసులు ఇవ్వటమేంటని మండిపడ్డారు. తాము ఆధారాలు ఇస్తే ఇక సిట్ ఏం దర్యాప్తు చేస్తుందని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సిట్ పై తమకు నమ్మకం లేదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. మొత్తానికి ఈ ఇష్యూని గట్టిగా వాడేసి మైలేజ్ పెంచుకునే పనిలో బీజేపీ ఉందని అంటున్నారు విశ్లేషకులు.