Advertisement
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వామపక్షాలు నిరసనలకు పిలుపునివ్వడం.. నిధులపై టీఆర్ఎస్ నిలదీస్తున్నాయి. పైగా ప్రోటాకాల్ రగడ కూడా నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఓసారి ఎవరెవరు? ఏమన్నారో చూద్దాం.
Advertisement
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రధానిని రాష్ట్రానికి రావొద్దనడానికి కారణమేంటో చెప్పాలి. ఆయన ప్రోగాంకు రాలేక ఆహ్వానంపై అసత్యాలు మాట్లాడుతున్నారు. ప్రధాని పర్యటనపై రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు. సీఎం ఎలాగూ రైతులకు న్యాయం చేయడం లేదు. ఆర్ఎఫ్సీఎల్ తో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంగతేంటి..?
వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభోత్సవానికి సీఎంను పిలిచే విషయంలో సరైన ప్రోటోకాల్ పాటించలేదు. సంబంధిత మంత్రికి లేఖ రాసి ఆహ్వానించారు తప్ప పీఎంవో నుంచి ఆహ్వానం లేదు. పెండ్లి పత్రిక కూడా ఇంటికి వెళ్లి ఇస్తారు. అలాంటిది పోస్టులో లేఖ పంపారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ దాడులు చేస్తున్నారు.
Advertisement
లక్ష్మణ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు
ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్… రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఆయన శైలి ఉంది. రాష్ట్ర అభివృద్ధికి మోడీ కృషి చేస్తుంటే.. కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కావాలనే ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటే.. తెలంగాణ అభివృద్ధి కోసం మరిన్ని వినతులు అడిగే అవకాశం లభిస్తుంది. కానీ, కేసీఆర్ కమ్యూనిస్టులను ఉసిగొల్పుతున్నారు.
బాల్క సుమన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ప్రధాని పోస్ట్ శాశ్వతం కాదు. కావాలనే మా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారు. భారత్ బయోటెక్ కు వచ్చినప్పుడు క్రెడిట్ కోసం ప్రధాని ఒక్కరే వెళ్లారు. ఎరువుల శాఖ మంత్రి పేరుతో కేవలం పాల్గొనాలి అని మరోసారి అవమానిస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం నాలుగు కోట్ల ప్రజల్ని అవమానించడమే. 14 నెలల కిందట ప్రారంభం అయిన ఎరువుల కర్మాగారం ఇప్పుడు మళ్లీ ప్రారంభించడం ప్రధాని డ్రామా.
ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ తో కలిసి నడిస్తే సీపీఐ, సీపీఎం పార్టీలను ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. సకాలంలో రైతులకు ఎరువులు అందించాలనే ఉద్దేశంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేసేందుకు ప్రధాని వస్తున్నారు. చేసిన తప్పుల వల్లనే మోడీ ముందుకు కేసీఆర్ రావట్లేదు. సీపీఐ, సీపీఎం నాయకులు ముఖ్యమంత్రి మాయమాటలు నమ్మొద్దు. ఆయన అందితే కాళ్ళు పడతాడు.. లేకుంటే జుట్టు పట్టుకుంటాడు.