Advertisement
ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం ఏదని అడిగితే.. అందరి వేళ్లు పాకిస్తాన్ వైపు చూపిస్తాయి. కానీ, దీన్ని ఆ దేశ నాయకులు అంగీకరించరు. అంతర్జాతీయ వేదికలపై పరువు పోతున్నా కూడా వితండవాదం చేస్తుంటారు. ముఖ్యంగా భారత్ ను ఆడిపోసుకోవడమేంటే వీరికి ఎంతో సరదా. మనం శాంతి వచనాలు వళ్లిస్తుంటే.. వాళ్లు మాత్రం ఏదో ఒక వివాదంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటారు. పాక్ ‘ఉగ్రవాద కేంద్రం’గా మారిందంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆరోపించారు.
Advertisement
జైశంకర్ వ్యాఖ్యలతో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఘాటైన విమర్శలు చేశాడు. మోడీని పరోక్షంగా బిన్ లాడెన్ తో పోల్చాడు. అంతటితో ఆగకుండా మోడీ భారత్ కు కాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే జైశంకర్ కూడా ఆర్ఎస్ఎస్ కే పని చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. భుట్టో వ్యాఖ్యలపై భారత్ రగిలిపోతోంది. పాకిస్తాన్ అత్యంత హీన స్థాయికి దిగజారినట్టు ఉందని ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి.
Advertisement
అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్.. తమ దేశ ప్రధానమంత్రిని తప్పు పట్టడం దారుణమని పేర్కొన్నాయి. ఉగ్రవాదానికి ఏ దేశం ఆర్థిక సహకారాన్ని అందిస్తోందనేది ప్రపంచం మొత్తానికీ తెలిసిన విషయమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. అటు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా భుట్టో వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన చేసిన కామెంట్స్ మోడీ ఇమేజీని ఏ మాత్రం ప్రభావితం చేయలేవని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ తన కుసంస్కారాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు.
బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. బిలావల్ భుట్టోకు, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కమలనాథులు నినాదాలు చేస్తూ ర్యాలీలు చేశారు. ప్రధానమంత్రి మోడీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ మంత్రికి మతి భ్రమించిందని.. ఉగ్రవాదం గురించి అడిగితే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు.