Advertisement
ఈనెల 18న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో కలిపి నలుగురు సీఎంలు, ఓ మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Advertisement
ఇప్పటికే ఖమ్మంలో ఎటుచూసినా భారీ హోర్డింగులు, కటౌట్లు, తోరణాలను ఏర్పాటు చేశారు. ఎటుచూసినా గులాబీ మయం కనిపిస్తోంది. సభాస్థలికి అన్నివైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. జాతీయ రహదారి, అన్ని ప్రధాన రోడ్ల పక్కన ఫ్లెక్సీలతో నింపేశారు. ఇరువైపులా గులాబీ తోరణాలు ఏర్పాటు చేశారు.
కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ముందుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరంతా 18న ఉదయం కేసీఆర్ తో కలిసి యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామివారి దర్శనానంతరం అందరూ అక్కడి నుంచి నేరుగా ఖమ్మం సభకు వెళ్తారు.
Advertisement
ఈ సభ కోసం 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తరలిస్తున్నారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి దాదాపు 5 లక్షల మందిని సమీకరించేలా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న ఈ సభ కోసం 100 ఎకరాలు సిద్ధం చేశారు. మొత్తం 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు 450 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. అన్ని పార్కింగ్ ప్రాంతాలు సభకు కనెక్ట్ అయ్యేలా రూట్ మ్యాప్ ను అందరికీ పంపారు. సభలో 50 ఎల్ఈడీ తెరలు, 100 మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేశారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలోని గ్యాలరీల్లో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఈ సభ తొలి మెట్టుగా బీఆర్ఎస్ భావిస్తోంది.