Advertisement
జాతీయ రాజకీయాల ఆశతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. చుట్టుపక్కల ఉన్నరాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతు ప్రకటించారు. ఎన్నికల టైమ్ కి రెండు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో అధ్యక్షుడ్ని ప్రకటించారు. రేపోమాపో పార్టీ ఆఫీస్ ను కూడా ప్రారంభించే ప్లాన్ లో ఉన్నారు. అయితే.. బీఆర్ఎస్ గా మార్పు జరిగాక తొలిసారి బహిరంగ సభ జరగనుంది. దీనికి ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
ఈనెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు కేసీఆర్. దీనికోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలను కలిసి దిశానిర్దేశం కూడా చేశారు. ఎలా చేయాలి..? ఏం చేయాలో ప్లాన్ కూడా గీసి ఇచ్చారు కేసీఆర్. ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన కీలక నేతలు హాజరయ్యారు. అయితే.. అంతగా ప్రభావం చూపని ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుపుతుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Advertisement
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన సీట్లు కేవలం ఒకటే. టీడీపీ, కాంగ్రెస్ గట్టిగా సీట్లు రాబట్టింది. అయితే.. ఇద్దరు మినహా మిగిలిన వారందరికీ గులాబీ కండువా కప్పేశారు కేసీఆర్. జిల్లాలో సొంతంగా పార్టీకి క్యాడర్ తక్కువే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, వారి అనుచరగణం ఎక్కువ. అయితే.. ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది. కేసీఆర్ సభ పెడుతున్న రోజే ఈయన అమిత్ షాను కలవనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే గనక జరిగితే ఆయన బాటలోనే మరికొందరు నేతలు నడుస్తారనే చర్చ జరుగుతోంది.
మొత్తానికి కేసీఆర్ ఖమ్మంలోనే సభ పెట్టడానికి ప్రధాన ఉద్దేశాలు రెండింటిని వివరిస్తున్నారు విశ్లేషకులు. పార్టీనుంచి జారుకోవాలని చూస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం ఒకటైతే.. రెండోది దగ్గరలో ఉన్న ఏపీ ప్రజల్ని కూడా ఆకట్టుకునే ఉద్దేశం అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 18న ఏం జరగబోతోందో చూడాలి.