Advertisement
ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ నేతలు కేసీఆర్ స్పీచ్ పై ఎటాక్ మొదలుపెట్టడంతో బీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. మాటకు మాట బదులిస్తున్నారు. కొందరు నేతలు అయితే కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Advertisement
ఎవరెవరు ఏమన్నారంటే!
పువ్వాడ అజయ్, మంత్రి
కంటి వెలుగులో బండి సంజయ్ అద్దాలు తీసుకుంటే మంచిది. ఖమ్మం సభ విజయవంతం కావటాన్ని సంజయ్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే తొండి మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏ మోటర్ లోనైనా సంజయ్ వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కేసీఆర్ నడుంబిగించారు. సమైఖ్య సూర్తిని దెబ్బతీస్తున్న మోడీ పాలనకు ఎండ్ కార్డు పడక తప్పదు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం కానున్నాయి.
ప్రశాంత్ రెడ్డి, మంత్రి
ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాలేదు. సంజయ్ కు బ్రెయిన్ ఫెయిల్యూర్ అయ్యింది. ఏదో ఒక విమర్శ చేయాలని అనడం తప్ప.. ఆయన మాటల్లో ఏం లేదు. ఇరుకు గల్లీలో పెట్టుకునే ఆయన ప్రజా సంగ్రామ సభలో ఎంత మంది ఉంటున్నారు. అసలు బండికి బహిరంగ సభల గురించి ఏం తెలుసు. మీడియా ముందు మాట్లాడుడు. చౌరస్తాలో మాట్లాడుడు. అంతే ఆయనకు తెలిసింది. ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి అఖిలేష్ యాదవ్ తాను ఇప్పటివరకు ఇంత పెద్ద సభ చూడలేదని ఆశ్చర్యపోయారు. సభకు వచ్చిన జనాలు బండి సంజయ్ కు కనిపించక పోవడం దురదృష్టకరం.
Advertisement
ఎర్రబెల్లి దయాకర్, మంత్రి
బీఆర్‌ఎస్ బహిరంగ సభను చూసిన ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయి. ఈ సభ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయ్యింది. జాతీయ నాయకుల రాకతో బీఆర్‌ఎస్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. దేశంలో రైతుకు న్యాయం చేసే ఏకైక నాయకుడు కేసీఆర్ అని దేశ ప్రజలు నమ్ముతున్నారు. రాజకీయ అనుభవం లేని బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోవాలి. చిల్లర మాటలతో జాతీయ నేతలను అవమానించడం మంచి సంస్కారం కాదు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకోవచ్చు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా తెలంగాణకు ఏమి తీసుకువచ్చారో తెలియజేయాలి.
జగదీష్ రెడ్డి, మంత్రి
ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభతో బీఆర్‌ఎస్ దేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది.2024 లో సరికొత్త శకానికి నాంది పడబోతుంది. కాంగ్రెస్, బీజేపీల పాలనలో దేశం గాఢాంధకారంలోకి నెట్టివేయబడింది. తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలవడంతో బీఆర్‌ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖమ్మం సభ సక్సెస్ తో అది నిరూపితమైంది.ఇప్పటికీ దేశంలో 35 శాతానికి పైబడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ కు దేశ ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయి.