Advertisement
ఎప్పుడూ వివాదాల్లో మార్మోగుతుంటుంది స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పేరు. ఈమధ్యే ఓ మహిళా సర్పంచ్.. తనను లైంగికంగా వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. రాజయ్యను ఓ ఆటాడుకున్నారు. ఈ ఇష్యూలో అధిష్టానం కలగజేసుకుని రాజయ్యకు చివాట్లు పెట్టింది. దీంతో ఆరోపణలు చేసిన సర్పంచ్ ఇంటికి వెళ్లి క్షమించమని వేడుకున్నారు. అయితే.. తనపై కుట్ర పూరితంగానే ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజయ్య.
Advertisement
వరంగల్ జిల్లా కరుణాపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకానొక సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను రాజకీయంగా ఎదురుకునే దమ్ములేకనే కొందరు దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. తనకు కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. తానేమీ తప్పు చేయలేదని.. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘన్ పూర్ లో 5వ సారి కూడా భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని తెలిపారు.
Advertisement
తాను మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మగవారితో సమానంగా రాణించాలని ప్రోత్సహిస్తున్నానని అన్నారు రాజయ్య. వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆత్మస్థైర్యాన్ని కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవరు ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఊపిరి ఉన్నంతవరకు ఘన్ పూర్ నియోజకవర్గమే తన దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని అన్నారు. ప్రజల మధ్యనే ఉంటా.. ప్రజల మధ్యనే చస్తానని వ్యాఖ్యానించారు రాజయ్య.
నియోజకవర్గంలో చాలాకాలంగా కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల మధ్య పంచాయితీ కొనసాగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఎవరికివారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలతో సొంత పార్టీ నేతలు కలిసిపోయారని తాజాగా రాజయ్య చేసిన వ్యాఖ్యలు శ్రీహరిని ఉద్దేశించి చేసినవేననే ప్రచారం జరుగుతోంది.