Advertisement
మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. బీఆర్ఎస్ లో కాస్ట్లీ లీడర్. ఈమధ్యే ఐటీ దాడులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. పోలీస్ స్టేషన్లలో కేసుల వరకు వెళ్లింది. పలుమార్లు మంత్రి కుటుంబసభ్యులు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ అంశాన్ని అంతా మర్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి మల్లారెడ్డి పేరు వార్తల్లోకెక్కింది.
Advertisement
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మంత్రి మల్లారెడ్డి మధ్య గ్యాప్ ఉంది. మంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై ఇన్నాళ్లూ సైలెంట్ గానే అసహనం వ్యక్తం చేసిన ఆయన.. సడెన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి , కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు మైనంపల్లి నివాసంలో సమావేశమయ్యారు. నామినేటేడ్ పదవుల విషయంలో మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Advertisement
తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్నారనేది వారి వాదన. పదవులను తన నియోజకవర్గానికి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ పదవి విషయంలో ఈ లొల్లి మొదలైంది. ఈ పదవిని కూడా మల్లారెడ్డి తన అనుచరుడికి ఇప్పించుకున్నారని మీడియా ముఖంగానే మండిపడ్డారు ఎమ్మెల్యేలు.
మరోవైపు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా భాస్కర్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. కండ్లకోయలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నియామకం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని తెలిపారు.