Advertisement
మునుగోడు ఉప ఎన్నికల వేళ మునుగోడులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకుని నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈక్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు నర్సయ్య. ఈ సందర్భంగా తన పాత బాస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Advertisement
కేవలం ఆత్మ గౌరవం కోసమే ఈటల రాజేందర్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాను టీఆర్ఎస్ ను వీడామని వివరించారు. కేసీఆర్ కు ఓట్లు, సీట్లు, డబ్బులే ముఖ్యమని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు నర్సయ్య. ఒక్కో ఎమ్మెల్యే బూత్ కు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు.
Advertisement
తెలంగాణ వచ్చాకే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పోయిందంటూ.. టీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. మరి ఫ్లోరైడ్ అంతమైతే.. ఫ్లోరోసిస్ రిసెర్చ్ సెంటర్ ఎందుకని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ అంతం అయినట్లుగా టీఆర్ఎస్ నేతలు కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బూర. రాజస్థాన్ లో తక్కువ ఖర్చుతో ఫ్లోరైడ్ ను నిర్మూలించారని.. దీనిపై టీఆర్ఎస్ మంత్రులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. తక్కువ ఖర్చుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదీ చేయదని.. మెగా ప్రాజెక్టులే చేపడుతుందని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని ఆరోపించారు నర్సయ్య. ఉమ్మడి ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాలు ఎక్కవయ్యాయని విమర్శించారు. టీఆర్ఎస్ ను ఎందుకు విడిచి వెళ్లిపోతున్నారో ప్రజలు గ్రహించాలని సూచించారు. ఇక మంత్రి మల్లారెడ్డి సిల్క్ స్మితలా తయారయ్యారని విమర్శలు చేశారు. ఉప ఎన్నిక తరువాత నేతలు వరదలా బీజేపీలో చేరతారని తెలిపారు నర్సయ్య గౌడ్.