Advertisement
సినిమాకు, సీమకు విడదీయలేని బంధం ఉంది. పవర్ ఫుల్ విలన్ అయినా, మాస్ హీరో అయినా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ నుంచే వస్తుంటారు. ఇలా వచ్చిన సినిమాలు ఎన్నో కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఈమధ్యే సంక్రాంతికి రిలీజైన వీరసింహారెడ్డి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. అయితే.. ఇలా సీమ బ్యాక్ డ్రాప్ లో తీసే సినిమాలపై అక్కడివారు తరచూ అభ్యంతరం చెబుతూనే ఉంటారు. కొన్నాళ్ల క్రితం అరవింద సమేత టైమ్ లో రచ్చ రచ్చ చేశారు కొందరు యువకులు. కానీ, వీరసింహారెడ్డి రిలీజ్ సందర్భంగా అంత హడావుడి లేదు.
Advertisement
విపరీతమైన ఫ్యాక్షన్ ను సినిమాల్లో చూపించడం కారణంగా తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదని అక్కడివారి వాదన. తాజాగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి సీమ సినిమాలపై ఫైరయ్యారు. రాయలసీమ నష్టపోవడానికి, తమకు అన్యాయం జరగడానికి రాజకీయ నాయకులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా కారణమని ఆరోపించారు. తమను సినిమాల్లో రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులుగా చూపించి.. సీమకు పెట్టుబడులు రాకుండా చేశారన్నారు. ఓ ప్రాంతం మీ కళ్ల ముందు నాశనం అవుతుంటే సిగ్గు లేకుండా సినిమాలు తీసి తమ జీవితాల్ని, భవిష్యత్తును లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు.
Advertisement
ఇప్పటికీ తమ ప్రాంతం వారు హైదరాబాద్ కు, లేక చెన్నైకి వలస వెళ్లి బతికే పరిస్థితి కొనసాగుతోందన్న బైరెడ్డి.. నిరుద్యోగ సమస్య దేశంలో ఎక్కడా లేనంతగా సీమలో ఉందన్నారు. ఇకపై సీమ ఫ్యాక్షన్ అంటూ సినిమాలు తీస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమకు భవిష్యత్ లేకుండా పోతుంటే, మీరు మాత్రం కాసులు లెక్కబెట్టుకుంటారా? అంటూ ఫైరయ్యారు. తమ ప్రాంతంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారని వాళ్ల గురించి సినిమాలు ఎందుకు తీయరని ప్రశ్నించారు బైరెడ్డి. రాయలసీమ వాళ్లంటే భయపడే పరిస్థితిని సినిమా వాళ్లు తీసుకొచ్చారని విమర్శించారు.
75 ఏళ్లుగా రాయలసీమ మోసపోతూనే ఉందన్నారు బైరెడ్డి. ‘‘హోస్పేట డ్యామ్, బళ్లారి జిల్లా పోయింది. వచ్చింది అనుకున్న రాజధాని మూడేళ్లకే పోగొట్టుకున్నాం. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి, బ్యారేజ్ నిర్మించాలి. దాంతోపాటు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల వల్ల జరిగిన నష్టం తమను బాధిస్తుంటే, సీమ ఫ్యాక్షనిజం అంటూ తీస్తున్న సినిమాలు తమకు మరింత నష్టాన్ని చేకూర్చాయని అన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.