Advertisement
ఈమధ్య ఇప్పటం గ్రామం చుట్టూ ఎంత రాజకీయం జరిగిందో చూశాం. జనసేనకు మద్దతుగా ఉన్నారన్న కక్షతో తమ ఇళ్లనుకూల్చారని స్థానికులు ఆరోపణలు చేశారు. బస్సే రాని ఊరిలో రోడ్ల వెడల్పు పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా గ్రామానికి వెళ్లి కూల్చివేతను పరిశీలించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న వైఎస్ విగ్రహాల్ని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు.
Advertisement
ఆరోజు పవన్ కు పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డారు. పార్టీ కార్యాలయం నుంచి బయలు దేరిన వెంటనే పర్మిషన్ లేదని ఆపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ నడుచుకుంటూనే ఇప్పటం బయలుదేరారు. కొంతదూరం నడిచాక వాహనం పైకి ఎక్కి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు. అయితే.. ఇది జరిగిన చాలా రోజులకు పవన్ పై కేసు నమోదైంది. తాడేపల్లి పోలీసులు ఆయనను ఏ 1గా పెట్టి.. కారు డ్రైవర్ ను ఏ 2గా చూపుతూ కేసు నమోదు చేశారు.
Advertisement
పవన్ కల్యాణ్ వల్ల తనకు బైక్ ప్రమాదం జరిగిందని తెనాలి మోరిస్ పేటకు చెందిన పి శివ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు ఖాకీలు. ఆరోజున ఇప్పటం రోడ్డు మీద వెళ్తున్న సమయంలో పవన్ కాన్వాయ్ వేగంగా వచ్చిందని.. పవన్ కారు పైన కూర్చుని ఉన్నాన్నారని అమిత వేగంతో డ్రైవర్ నడిపించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు శివ.
పవన్ కారు వెంట.. వేగంతో చాలా కార్లు వచ్చాయని.. ఆ కారణంగా అదే రోడ్డుపై బైక్ పై వెళ్తున్న తాను స్కిడ్ అయి కిందపడిపోమానని చెప్పాడు. తన ప్రమాదానికి కారణం పవన్ కల్యాణ్, అతని డ్రైవరేనని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు ఖాకీలు. ఈ ఎఫ్ఐఆర్ ప్రధాని ఏపీ పర్యటన ముగించుకుని తెలంగాణకు బయలుదేరి వెళ్లిన తర్వాత బయటకు వచ్చింది. ఇది ముమ్మాటికీ ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసేనని జనసేన వర్గాలు అంటున్నాయి. ఎన్ని కేసులు పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాయి.