Advertisement
ఏపీలో క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. బహిరంగంగానే ఇవి నడిపిస్తూ ఉంటారు అక్కడి రాజకీయ నేతలు. అయితే.. తెలంగాణలోనూ ఇవి ఉంటాయి. కానీ, సైలెంట్ గా జరిగిపోతుంటాయి. ఎన్నికల సమయంలో కుల సంఘాలకు చెందిన నాయకుల్ని గ్రిప్ లో పెట్టుకోవడం.. ఆయా పార్టీల్లోని లీడర్లకు వెన్నతో పెట్టిన విద్య. అయితే.. ఈసారి ముందే పార్టీలు మేల్కొన్నట్టు కనిపిస్తోంది.
Advertisement
ఆదివారం రెండు ప్రోగ్రామ్స్ హైలైట్ అయ్యాయి. వాటిలో ఒకటి బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ‘వెనుకబడిన తరగతుల భవిష్యత్తు అభివృద్ధి’ అనే పేరుతో జరిగిన కార్యక్రమం కాగా.. మరొకటి.. ప్రజ్ఞాపూర్ లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనం. ఈ రెండు కార్యక్రమాలు క్యాస్ట్ ఈక్వేషన్స్ తోనే జరిగాయని స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే.. ఒకచోట బీఆర్ఎస్ లీడర్ తలసాని శ్రీనివాస్, ఇంకోచోట బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొని తమదైన రీతిలో చేసిన ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
యాదవుల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి తలసాని.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ యాదవుల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న స్వరూపం అని అన్నారు. యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఎక్కడా లేనివిధంగా రూ.11వేల కోట్ల వ్యయంతో 75శాతం సబ్సిడీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే, మన అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మంత్రి టార్గెట్ ఏంటో స్పష్టంగా ఉంది. యాదవులు అంతా బీఆర్ఎస్ వైపు ఉండాలనేది ఆయన తాపత్రయంగా చెబుతున్నారు విశ్లేషకులు.
మరోవైపు బీసీ సమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతి విషయంలోనూ వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీసీల విషయంలో మరింత పక్షపాతంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 50 శాతం ఉన్న బీసీల నుంచి ముగ్గురికి మంత్రి పదవులు, 17 శాతం ఉన్న షెడ్యుల్డ్ కులాల వారి నుంచి ఒకరికి మాత్రమే పదవి ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఆ సమస్యను ప్రశ్నించే వారిపై కక్ష పెంచుకొని మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. సో.. ఈటల ఉద్దేశం ఏంటో స్పష్టంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. బీసీలంతా బీఆర్ఎస్ కు దూరంగా ఉండాలన్నదే ఆయన మాటగా వివరిస్తున్నారు. మొత్తానికి క్యాస్ట్ ఈక్వేషన్స్ పాలిటిక్స్ రానున్న రోజుల్లో ఏపీ మాదిరిగా తెలంగాణలోనూ బహిరంగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.