Advertisement
ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? అని తెలంగాణలో పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగురువేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జనంలోకి వెళ్తూ.. సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని పిలుపునిస్తోంది కాంగ్రెస్. డిసెంబర్ లో ప్రస్తుత ప్రభుత్వ గడువు పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే జనవరిలో ఎన్నికలు ఉంటాయి. అంతకంటే ముందే వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే.. తెలంగాణలో ఎలక్షన్ మూడ్ ను తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే ఉండటంతో సన్నాహక చర్యలపై కసరత్తులు ప్రారంభించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారుల బృందం శనివారం హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తో పాటు పలువురు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించింది.
Advertisement
ఓటర్ల జాబితా, మార్పులు, చేర్పులు.. ఈవీఎంల సన్నద్ధత, ఇతర అంశాలపై వీరంతా చర్చలు జరిపారు. ఎలాంటి లోపాలు లేని ఓటర్ల జాబితా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఈసీ బృందం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాను కూడా సిద్ధం చేయాలని సీఈఓ వికాస్ రాజ్ కు స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి ఈవీఎంల మొదటి దశ చెకింగ్ చేపట్టాలని.. జిల్లా ఎన్నికల అధికారులకు త్వరలోనే రెండు రోజుల సెమినార్ నిర్వహిస్తామని పేర్కొంది. ఈసీఐఎల్ సరఫరా చేసిన ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపామని వికాస్ రాజ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈసారి పోల్ శాతాన్ని పెంచడానికి కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది ఈసీ బృందం. ఈ సమావేశంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, ఈసీఐ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సీఈవో రవికిరణ్, డిప్యూటీ సీఈవో సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.