Advertisement
టీడీపీ హయాంలో అమరావతికి జై కొట్టిన వైసీపీ.. అధికారంలోకి రాగానే మాట మార్చింది. మూడు రాజధానులు అంటూ వివాదానికి ఆజ్యం పోసింది. వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి అంటూ చెబుతూ వస్తోంది. అయితే.. మూడు రాజధానుల అంశం ప్రకటనలకే పరిమితం అయింది. అయినా, తమ స్టాండ్ మాత్రం ఇదేనని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికైనా ఏపీకి మూడు రాజధానుల్ని చేసి తీరతామని బల్లగుద్ది మరీ చెబుతూ వస్తున్నారు.
Advertisement
ఈమధ్య ఏపీ రాజధాని విశాఖే అని కీలక మీటింగ్ లో అన్నారు సీఎం జగన్. తాను కూడా అక్కడికే మకాం మారుస్తున్నానని చెప్పారు. దీనిపై పార్టీల మద్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. ఏపీకి అమరావతే రాజధాని అని టీడీపీ నేతలు అంటే.. కాదు విశాఖే అని వైసీపీ నేతలు పోటాపోటీగా తిట్టుకున్నారు. సోషల్ మీడియాలోనూ వార్ కొనసాగింది.
Advertisement
అయితే.. ఏపీ రాజధాని అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆర్టికల్ 154 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందన్నారు. రాజధానిపై పూర్తి అధికారం రాష్ట్రానిదే అని.. ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించేందుకే.. 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించామని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర ఉంటే.. హైకోర్టు మరో ప్రాంతంలో ఉందని గుర్తుచేశారు.
విజయసాయి ప్రశ్నలపై కేంద్ర హోంశాఖ షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటీఫై చేసిందని పేర్కొంది. సెక్షన్ 5, 6 ప్రకారమే రాజధాని ఏర్పాటైందని తెలిపిన కేంద్రం.. ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని తెలిపింది. దీనిపై మాట్లాడటం సబ్ జ్యుడీస్ అవుతుందని లిఖిత పూర్వక జవాబు ఇచ్చింది. 2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును తెచ్చిందని, అది తెచ్చే ముందు తమను సంప్రదించలేదని తెలిపింది.