Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రతిపక్ష పార్టీలు కొన్నాళ్లుగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తమ మిత్రులకు లాభం చేకూర్చేలా కేంద్రం అడుగులు వేస్తోందని విమర్శలు చేస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. గురువారం స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని అనుకోవట్లేదన్నారు ఫగ్గన్ సింగ్. కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్ అధికారులతో భేటీ అవుతున్నామని.. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనడం వారి పరిధిలోని విషయమని చెప్పారు. ఈనెల 15 వరకూ బిడ్డింగ్ గడువు ఉండగా.. కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది.
Advertisement
అయితే.. కేసీఆర్ రంగంలోకి దిగడం వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని అంటున్నారు మంత్రి కేటీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పారని… ఆయన పోరాటంతోనే కేంద్రం వెనకడుగు వేసిందని అన్నారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది కేసీఆరేనని చెప్పారు. తాము తెగించి పోరాడాం కనుకనే ప్రైవేటీకణపై కేంద్రం తగ్గిందని అన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే ఇలాగే ఉంటుందని చెప్పారు.
విశాఖ ఉక్కు కర్మాగారం బిడ్డింగ్ లో పాల్గొనాలని ఈమధ్యే కేసీఆర్ నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా.. టెండర్ లో పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం సింగరేణి అధికారులను సైతం ఫ్యాక్టరీకి పంపారు. ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ విషయంలో ఏపీ మంత్రి అమర్నాథ్ బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. ఈ వివాదం నడుస్తుండగానే.. ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి అలా మాట్లాడడం.. ఇది తమ వల్లే జరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశాలుగా మారాయి.