Advertisement
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంలో ఆర్టీసీ కార్మికులు, అధికారులతో కలిసి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంపు కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు . ఈ సందర్భంగా బాజిరెడ్డిని కలిసి నిజామాబాద్ కు చెందిన 6 డిపోల మేనేజర్లు, ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఈ నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని నేను కూడా ఊహించలేదు. నా హయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కు ఆర్టిసి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఈ కానుకను కాపాడుకోవాలి. బాధ్యతతో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. సంస్థను కాపాడుకోవాలని తెలిపారు. తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటామని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ఆర్టీసీ విలీనాన్ని బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సెక్టార్లను అమ్ముకునే బీజేపీ నేతలు ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు, డిపో మేనేజర్లతో పాటు వారి కుటుంబాలు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు పేర్కొన్నారు.