Advertisement
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీ స్పీడ్ పెంచింది. ఓవైపు యువనేత లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తుండగా.. ఇంకోవైపు చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లోకేష్ సీమ జిల్లాల్లో పర్యటిస్తుంటే.. చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Advertisement
ఎక్కడికి వెళ్ళినా గంజాయి సరఫరా, బ్లేడ్ బ్యాచ్ ల ఆగడాలపైనే చెబుతున్నారని.. డీజీపీ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు గంజాయి నివారణపై కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలన్నారు. గంజాయితో మన బిడ్డల భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలని చెప్పారు చంద్రబాబు. పెద్దాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించగా భారీగా జనం తరలివచ్చారు. జగన్ సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను వాడుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
జగన్ బటన్లు నొక్కి కాలయాపన చేస్తున్నారని.. రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారని సెటైర్లు వేశారు చంద్రబాబు. ఓడితే ఏ జైలుకి వెళ్తారో తెలియదు, ప్రజలు నెత్తిన అప్పులు వదిలి వెళ్తారని మండిపడ్డారు. రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదని.. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని విమర్శించారు. 40 కోట్ల రూపాయల విలువైన భూములను వైసీపీ నేతలు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు చంద్రబాబు. వారితో మాట్లాడడం ఎప్పుడూ ఆసక్తికరమే, ఆహ్లాదకరమేనని తెలిపారు. పెద్దాపురం పర్యటనలో వారితో కొద్దిసేపు గడిపే అవకాశం దక్కిందని.. వారందరికీ ఎన్నో లక్ష్యాలు ఉంటాయని.. అవి చేరుకునేలా వారికి అవకాశాలు కల్పించడం పాలకుల విధి అని తెలిపారు. మనం వీళ్లకు సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ట్వీట్ చేశారు చంద్రబాబు.