Advertisement
తెలంగాణలో టీడీపీ దాదాపు కనుమరుగైందనే ప్రచారం ఉంది. బలమైన నేతలు లేక, క్యాడర్ విచ్ఛిన్నం అయిపోయింది. కానీ, తెలంగాణలోనే పుట్టిన టీడీపీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని చంద్రబాబు అనేక ప్రయత్నాల్లో ఉన్నారు. ఈమధ్యే పార్టీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించారు. ఆయన బాబు సారథ్యంలో పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరిగేలా చూస్తున్నారు.
Advertisement
గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి రెండు సీట్లను సాధించింది టీడీపీ. ఈ క్రమంలో అక్కడి నుంచే పోరు మొదలుపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. జిల్లాలో పార్టీ బలంగా ఉందని విశ్వసించి.. ఈనెల 21వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేశారు. చంద్రబాబు పాల్గొనే ఈ సభలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించాలని అనుకుంటున్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని జ్ఞానేశ్వర్ ఇప్పటికే పిలుపునిచ్చారు.
Advertisement
గతంలో గోదావరి వరదల సమయంలో భద్రాచలంలో పర్యటించారు చంద్రబాబు. ఖమ్మం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పై చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశముందని చెబుతున్నారు. సెటిలర్లు ఎక్కువమంది నివాసం ఉంటున్న ప్రాంతం హైదరాబాద్. టీడీపీకి ఇక్కడ కాస్త పట్టుంది. పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో కార్యకలాపాలు తగ్గిపోయాయి. దానికి కారణం టీడీపీకి చెందిన కీలక లీడర్లంతా టీఆర్ఎస్ గూటికి చేరడమే. అయితే.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. కచ్చితంగా తెలంగాణ నినాదం పని చేయదు. ఇంతకుముందులా సెంటిమెంట్ రగిలించాలని చూస్తే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
2014 ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ తోనే టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను సాధించింది. ఆ సమయంలో వచ్చిన సీట్లు 60కి దగ్గరలోనే, ఆ తర్వాత ముందస్తు ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడాన్ని బూచిగా చూపించారు కేసీఆర్. రెండు పర్యాయాలు టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచిన లీడర్లను లాగేసుకున్నారు. దీంతో క్యాడర్ కూడా అటువైపు షిఫ్ట్ అయింది. కానీ, టీడీపీ అంటే అభిమానం పోని వాళ్లు చాలామంది ఉన్నారు. పార్టీ యాక్టివ్ గా లేకపోవడం వల్లే ఇతర పార్టీల్లో ఉన్న వారందరినీ ఇప్పుడు తిరిగి తమవైపు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. పైగా టీడీపీ కార్యక్రమాలకు ఇప్పుడు కేసీఆర్ అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు. అందుకే పార్టీ పనుల్లో స్పీడ్ పెంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం.