Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు వారిని సిద్ధం చేస్తున్నారు. బాదుడే బాదుడు అంటూ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన.. నందిగామ పర్యటనకు వెళ్లారు. అయితే.. అక్కడ రాయితో దాడి జరగడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఈ దాడిలో చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకి గాయాలయ్యాయి. అతని గడ్డం కింద గాయమైంది. వెంటనే వైద్యులు చికిత్స అందించారు.
Advertisement
మధుకు గాయం కావడం, రక్తం కారుతున్న దృశ్యాలను చూసిన వెంటనే కోపోద్రిక్తుడైన చంద్రబాబు.. మైకు తీసుకుని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. తన రోడ్ షోకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అంతు చూసే వరకు నిద్ర పోనంటూ రాయి విసిరిన వ్యక్తులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు.
Advertisement
అక్రమ కేసులు, దాడులతో రాజ్యమేలాలని వైసీపీ చూస్తోందని, కేసులు, దాడులకు టీడీపీ నేతలు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏపీలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమలు లేవని బటన్ ఇన్ కార్యక్రమం మొదలు పెట్టుకున్నారని మండిపడ్డారు. సాయంత్రం కాగానే తన ఆదాయంపై లెక్కలు మొదలెడతారని, మద్యం మొదలు అన్నింటా జగన్ రెడ్డి అక్రమార్జన పెరిగిందని ఆరోపించారు.
ఈ దాడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ”చంద్రబాబుపై దాడి వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ఠ. దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రౌడీ రాజకీయాలతో భయపెట్టాలనుకోవడం మీ కల. చంద్రబాబు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గూండాల పరిస్థితి ఏంటి? దాడి చేసిన వారిని, దాడి చేయించినవారిని వెంటనే అరెస్ట్ చేయాలి” అని అచ్చెన్న డిమాండ్ చేశారు. అయితే.. ఇది చంద్రబాబు పనే అని.. ఆయనకు రాళ్లు వేయించుకోవడం అలవాటేనని వైసీపీ నేతలు అంటున్నారు.