Advertisement
ఏపీలో సోషల్ మీడియా వాడకం గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు తమను ప్రచారం చేసుకుంటూనే అవతలి పార్టీలను ఏకిపారేస్తుంటాయి. ఇక కార్యకర్తలు, నాయకుల అభిమానుల సంగతి సరేసరి. ఎదుటి పార్టీ నేతల్ని తిట్టడమే పనిగా పెట్టుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. అడపాదడపా ప్రభుత్వం పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టులు కూడా జరుగుతుంటాయి. వైసీపీ వర్గాలు ఇతర పార్టీల వాళ్లను ఏమన్నా పట్టించుకోని పోలీసులు.. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులను మాత్రం టార్గెట్ చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. తరచూ ఇలా ఏదో ఒక ఇష్యూ తెరపైకి వస్తుంటుంది.
Advertisement
తాజాగా గన్నవరానికి చెందిన ఎన్నారై యువకుడు పొందూరి కోటిరత్నం అంజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను చేసిన తప్పేంటంటే.. సీఎంకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడమే. రాయ్ నగర్ కు చెందిన అంజన్ అమెరికాలో పీజీ, ఉద్యోగం చేసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. అయితే.. సోషల్ మీడియాలో జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ.. పది మంది పోలీసులు మఫ్టీలో వచ్చి అతడ్ని ఎత్తుకుపోయారు. ఈ మేరకు మీడియాకు అతని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Advertisement
అయితే.. అంజన్ ను తొలుత గన్నవరం పోలీస్ స్టేషన్ కు తర్వాత ఉంగుటూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే.. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పడం లేదని.. తమ కుమారుడికి ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని అతని తల్లి రత్నకుమారి ఆరోపించారు. వైసీపీ, టీడీపీ పోల్స్ కు సంబంధించిన పోస్టును అంజన్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై గన్నవరం శ్రీనగర్ కు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని సమాచారం. ఆ కంప్లయింట్ ఆధారంగా చేసుకునే అంజన్ ను అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అంజన్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని అంజన్ ను తీసుకువెళ్లిన పోలీసులు.. ఇప్పటికీ అతని ఆచూకీ చెప్పకపోవడం నిబంధనల ఉల్లంఘనే అని అన్నారు. వెంటనే తప్పుడు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని.. అతడ్ని వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.