Advertisement
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజకవర్గాల్లో జోరుగా పర్యటనలు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా జనంలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొడాలి నాని గడ్డపై అడుగుపెట్టారు. గుడివాడ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో ఒక రాత్రి నిద్ర కూడా చేశారు.
Advertisement
తులసి వనంలో గంజాయి మొక్కలా కొడాలి నాని తయారయ్యారని అన్నారు చంద్రబాబు. త్వరలోనే ఆ మొక్కను పెకిలించేద్దామని పిలుపునిచ్చారు. అయినా, బూతులు మాట్లాడటం గొప్పతనం అవుతుందా? అని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ జెండా పట్టుకుని రోడ్డుపైకి వస్తే బూతుల మాజీ మంత్రి రోడ్డుపై తిరగగలడా అంటూ సెటైర్లు వేశారు. నియోజకవర్గంలో సరైన రోడ్డు వేయలేని ఈ ఎమ్మెల్యే.. క్యాబరే డ్యాన్సులు మాత్రం వేయిస్తారంటూ విమర్శించారు. పేకాట క్లబ్బులు తెచ్చి డబ్బులు దండుకుంటారని ఆరోపించారు. తెలుగు జాతి గర్వించేలా నిమ్మకూరు ప్రాంతాన్ని స్ఫూర్తిదాయకంగా తయారుచేస్తామని చెప్పారు.
Advertisement
అయితే.. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చి వెళ్లారని అన్నారు. కనీసం ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు కూడా ఆయన పెట్టలేదని అన్నారు. తాము పెట్టిన విగ్రహలకు చంద్రబాబు దండలు వేశారని అన్నారు. నిమ్మకూరును హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారని.. చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను తాను, జూనియర్ ఎన్టీఆర్ కలిసి రూ.60 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసామని వివరించారు.
ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని.. 2019లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు కొడాలి నాని. గుడివాడలో తాము 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నామని.. చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశారని ఆరోపించారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. నిమ్మకూరులో బస చేసినప్పుడు కూడా చంద్రబాబు బస్సులోనే పడుకున్నారని, ఎవరూ ఇంట్లోకి రానిచ్చి ఆతిథ్యం ఇవ్వలేదని చెప్పారు కొడాలి నాని.