Advertisement
నడిపించే దీపం అమ్మ.. కరుణించే కోపం అమ్మ.. వరమిచ్చే తీపి శాపం అమ్మ.. చంద్రబోస్ సాహిత్యం నుంచి జాలువారిన నాని సినిమాలోని ఈ పాట.. అమ్మ గొప్పతనాన్ని, ప్రేమను గుర్తు చేస్తుంటుంది. బిడ్డలపై ప్రేమ కురిపించడంలోనే కాదు.. వారికి ఆపద వస్తే కాపాడడంలోనూ అమ్మను మించినవారు ఎవరూ ఉండరేమో. తాజాగా ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఓ సంఘటన చూస్తే అదే అనిపిస్తుంది.
Advertisement
కోర్బా జిల్లాలో కన్నకూతురిని కాపాడడం కోసం అడవి పందితో ఫైట్ చేసింది ఓ మహిళ. కానీ, చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దువాషియా బాయి(45) అనే మహిళ తన కూతురు రింకి(11)తో తెలియామర్ గ్రామంలో అడవికి సమీపంలో పనులు చేసుకుంటూ ఉండగా.. ఒక్కసారి అడవి పంది దాడికి దిగింది. దీంతో గడ్డపారతో దానికి అడ్డుగా నిలబడింది దువాషియా.
Advertisement
ఆ అడవి పంది ఇంకా వదలకుండా దాడి చేయడంతో దువాషియాకి తీవ్ర గాయాలయ్యాయి. తనకు ఎన్ని గాయాలైనా సరే కూతురి వద్దకు అడవి పందిని వెళ్లనివ్వకుండా ఆపగలిగింది. తన బిడ్డకు చిన్న గాయం కూడా కాకుండా చూసుకుంది.
చివరకు దువాషియా అడవి పందిని చంపేసింది. అయితే, తీవ్రగాయాలతో కాసేపటికే కన్నుమూసింది. ఈమె కుటుంబానికి అటవీ శాఖ అధికారులు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇచ్చారు. మరో రూ.5.75 లక్షల పరిహారాన్ని త్వరలోనే అందిస్తామని తెలిపారు.