Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ పై అంచనాలు పెరుగుతున్నాయి. సీట్ల కోసం పోటీ పెరిగింది. కొత్త ముఖాలు తెర పైకి వస్తున్నాయి. తమకే సీటు అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, కాంగ్రెస్ లో ఎవరికి సీటు అనేది డిసైడ్ చేసేది హైకమాండ్. పార్టీ జెండా భుజాన వేసి మోసిన వారికే ప్రాధన్యత ఖాయం. కొత్తగా పార్టీలో చేరిన వారంతా తమకు సీట్లు ఖాయమంటూ చేసుకుంటున్న ప్రచారంతో డొల్ల తనం బయట పడుతోంది. తాజాగా తీన్మార్ మల్లన్న తనకు మేడ్చల్ సీటు ఖాయమని ప్రమోట్ చేసుకుంటున్నారు. పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ దక్కలేదు. మేడ్చల్ లో కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నా..నష్టాలు భరించి పని చేసిన నేతలు ఉన్నారు. వారి వైపే కాంగ్రెస్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ లో పెరిగిన జోష్ తో టికెట్ల పైన పలువురు ఆశలు పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ కు అధికారం ఖాయమని నమ్మి పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు ముఖ్య నేతలు తమతో పాటుగా తమ విధేయులకు సీట్లు కావాలంటూ పార్టీలో చేరిక సమయంలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కొంత వరకు వారి షరతులకు పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతోంది. అదే సమయంలో పార్టీని తొలి నుంచి నమ్ముకున్న వారు ఉన్న స్థానాల్లో మాత్రం ఆచి తూచి స్పందిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించి కొత్త వారికి ప్రాధాన్యత ఉండదని తాజాగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశం లో హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మేడ్చల్ నియోజకవర్గం అంశం తెర మీదకు వచ్చింది.
Advertisement
కాంగ్రెస్ సీటు తనకే అంటూ తీన్మార్ మల్లన్న కొంత కాలంగా ప్రమోట్ చేసుకుంటున్న అంశం చర్చగా మారింది. సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న తానే కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు.
దీనిని పార్టీ నేతలు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాము ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కోసం మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డితో పాటుగా జంగయ్య యాదవ్, హరి వర్ధన్ రెడ్డి పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు మల్లన్న తానే అభ్యర్ధి అని ప్రచారం చేసుకోవటం పైన పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ అందరి సమిష్టి నిర్ణయం మేరకు అభ్యర్ధిని ఖరారు చేసి..అందరూ అభ్యర్ధి గెలుపుకు పని చేసేలా టికెట్ల ఖరారు విషయంలో హైకమాండ్ ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తోంది.
ఇప్పుడు ఎవరికి వారు టికెట్లు తమకే అంటూ ప్రచారం చేసుకోవటం సరి కాదని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. టికెట్ల ఖరారు నిర్ణయం పూర్తిగా తామే పర్యవేక్షిస్తామని పార్టీ సీనియర్లకు హైకమాండ్ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే పార్టీలో నేతల చేరికల సమయంలో ఒప్పందాలను నేరుగా పార్టీ నాయకత్వం చర్చిస్తుంది. వారి అభ్యర్దనల పైన ఆచి తూచి స్పందిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న మేడ్చల్ లాంటి నియోజకవర్గాల్లో అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం పని చేసిన వారి సేవలను విస్మరించేదిలేదని స్పష్టం చేస్తోంది. అభ్యర్ధిని గెలిపించాల్సింది స్థానిక నేతలు..కేడర్ కావటంతో వారి అభీష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు ఉండవని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు.