Advertisement
రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ కొనసాగారు. ఏపీలో ఆరేళ్లు ఆయనే ఆ పదవిలో ఉన్నారు. కానీ, 2019 ఎన్నికల తర్వాత ఏపీలో గవర్నర్ మార్పు జరిగింది. రాష్ట్రానికి రెండో గవర్నర్ గా ఒడిశాకు చెందిన సీనియర్ నాయకుడు బిశ్వభూషణ్ హరిచందన్ వచ్చారు. బీజేపీ నియమించిన ఈయనతో జగన్ ప్రభుత్వానికి ఎలాంటి చిక్కులు రాలేదు. అంతా సవ్యంగా సాగిపోయింది. అయితే.. ఈమధ్యే బిశ్వభూషణ్ చత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీ అయ్యారు. ఏపీకి కొత్త గవర్నర్ గా సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు.
Advertisement
ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రభుత్వం వీడ్కోలు పలికింది. మంగళవారం ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ కూడా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. రాష్ట్రాన్ని వీడుతున్నందుకు ఎంతోబాధగా ఉన్నప్పటికీ కేంద్రం తనకు మరో బాధ్యత అప్పగించిందన్నారు.
Advertisement
ఆంధ్రప్రదేశ్ తన రెండో ఇల్లు అని, జగన్ తనను కుటుంబ సభ్యుడిలా అభిమానించారని అన్నారు గవర్నర్. జగన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్నది ఆచరణలో గవర్నర్ గొప్పగా చూపించారని కొనియాడారు. గవర్నర్లకు, రాష్ట్రాలకు మధ్య ఉన్న సంబంధాలపై ఈ మధ్య వార్తలు చూస్తున్నామని, కానీ, అందుకు భిన్నంగా తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ, వాత్సల్యం చూపించారని చెప్పారు.
ఇక ఏపీ గవర్నర్ గా మూడేళ్ల 6 నెలల 12 రోజులపాటు పని చేశారు బిశ్వభూషణ్. 2019 జులై 17 నుంచి 2023 ఫిబ్రవరి 12 వరకు సేవలందించారు. అలాగే, కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 24వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. సయ్యద్ అబ్దుల్ నజీర్ ఏపీకి మూడో గవర్నర్.