Advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్.. సడెన్ గా ఆస్పత్రికి వెళ్లడం బీఆర్ఎస్ శ్రేణుల్ని కలవరానికి గురి చేసింది. ఏం జరుగుతుందో ఏంటో కాసేపు ఏమీ అర్థం కాలేదు. ముందు ఆయన భార్య శోభ అస్వస్థతకు గురయినట్లు వార్తలు వచ్చాయి. ఆమెకు ట్రీట్ మెంట్ చేయించేందుకు కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని అన్నారు. కానీ, కాసేపటికి న్యూస్ మారింది. కేసీఆరే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.
Advertisement
ఆదివారం ఉదయం లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కవితతో భేటీ అయ్యారు కేసీఆర్. దాదాపు గంటపాటు వీరి చర్చ సాగింది. అయితే.. ఆ తర్వాతే అస్వస్థతకు గురయ్యారు కేసీఆర్. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. పొత్తి కడుపులో సమస్యగా అనిపించడంతో సీఎం ఆస్పత్రికి వచ్చారని వైద్యులు వివరించారు.
Advertisement
గ్యాస్ట్రిక్ సంబంధిత పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కేసీఆర్ కు కడుపులో చిన్నపాటి అల్సర్ ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఆస్పత్రికి సీఎం వెంట ఆయన భార్య శోభ, కూతురు కవిత, మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఇతర నేతలు ఉన్నారు. గతంలోనూ కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆయన్ని అధికారులు సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. అన్ని పరీక్షల నిర్వహించిన అనంతరం వెన్నెముకలో కొంచెం సమస్య వున్నట్టు గుర్తించామని అప్పట్లో ప్రకటించారు.
కేసీఆర్ ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఐప్యాడ్ చూస్తుండడం వంటి కారణాల వల్ల వెన్నెముకపై బాగా ఒత్తిడి పెరిగి వుంటుందని వైద్యులు తెలిపారు. అలాంటి సమయంలో సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలు వచ్చి ఎడమ చేతికి నొప్పి వస్తుందని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు అల్సర్ ను గుర్తించారు. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ అనంతరం కేసీఆర్.. ప్రగతి భవన్ కు వెళ్లారు.